మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మణిపూర్‌ గురించి మాట్లాడండి

SFI – ప్రధానిని ప్రశ్నిస్తూ 15 నుంచి 25 వరకు కోటి ఈ-మెయిల్స్‌, పోస్టు కార్డులు : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ పిలుపు
న్యూఢిల్లీ : మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం దాల్చడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ప్రశ్నించాయి. ఈ మేరకు ”మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మణిపూర్‌ గురించి మాట్లాడండి” అంటూ కోటి ఈ-మెయిల్స్‌, పోస్టు కార్డులు పంపించేందుకు సిద్ధమయ్యాయి. 15 నుంచి 25 వరకు కోటి ఈ-మెయిల్స్‌, పోస్టు కార్డులు పంపించాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శనివారం నాడు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి. సాను, ఎఎ రహీం, వయూక్‌ బిస్వాస్‌, హిమఘ్నరాజ్‌ భట్టాచార్య సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకనైనా ‘ప్రధానమంత్రి మాట్లాడతారా?” అని ప్రకటనలో ప్రశ్నించారు. ”మణిపూర్‌లో అశాంతి నెలకొని రెండు నెలలు దాటింది. పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ, ఈ కీలకమైన అంశంపై మన ప్రియమైన ప్రధాని మౌనంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. తమ ప్రచారంలో పాల్గొని, మణిపూర్‌లో పరిస్థితిని పరిష్కరించడానికి ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని వ్యక్తులు, సంస్థలు, ప్రజాస్వామ్య, పౌర సంఘాలకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌కు సంఘీభావంగా నిలుద్దామంటూ పేర్కొన్నారు.