పంచాయతీ సిబ్బందిని ఆగం చేయొద్దు

– వారిని ఆదుకోవాలి..సమస్యలను పరిష్కరించాలి
– చర్చలకు పిలవండీ..సామరస్యంగా మాట్లాడుకుందాం : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పంచాయతీ సిబ్బందిని ఆగం చేయొద్దనీ, వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.యజ్ఞనారాయణ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పంచాయతీ సిబ్బంది వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని మంత్రి చెప్పడంలో పాక్షిక సత్యమే ఉందని పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలను పున:పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్మికులకు కర్నాటకలో ప్రభుత్వమే పారిశుధ్య కార్మికులకు రూ.16,950, బిల్‌ కలెక్టర్లకు రూ.16,250 చొప్పున కనీస వేతనాలను చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మేజర్‌ పంచాయతీల్లో రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు చెల్లిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో మైనర్‌ పంచాయతీల్లో చెల్లిస్తున్న వేతనాలనే పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోని మేజర్‌ పంచాయతీల్లో కార్మికులు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనాలు పొందేవారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రమొచ్చాక పంచాయతీ కార్మికులకు గుండుగుత్తగా రూ.8,500 వేతనం నిర్ణయించి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని 500 జనాభాకి ఒక కార్మికుడిని నియమించి రూ.8,500 ఇస్తున్నారనీ, ఇచ్చే ఆ అరకొర వేతనాన్ని కూడా కార్మికులు పంచుకోవాల్సి వస్తున్నదని వివరించారు. దీంతో వారికి ఐదారువేల రూపాయలకు మించి వేతనాలు దక్కడం లేదని వాపోయారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరిగాదని మంత్రికి సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు మన దగ్గర వేతనాలు పెరిగాయనీ, దానికి లేని పోలిక పంచాయతీ సిబ్బంది వేతనాలకు ఎందుకు? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదనీ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్నట్టుగానే వారికీ వేతనాలు అడుగుతున్నామని తెలిపారు. మల్టీపర్పస్‌ విధానం గురంచి ఆలోచించాలని కోరుతున్నామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సామరస్యపూర్వకంగా చర్చలు జరుపకుండా క్షద్ర రాజకీయాలతో పోల్చడం సరిగాదని పేర్కొన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. జేఏసీని చర్చలకు పిలిచి వెంటనే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని మంత్రిని కోరారు.

జీపీ కార్మికుల సమ్మెకు మున్సిపల్‌ కార్మికుల సంఘీభావం
– 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు :
తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) తెలిపింది. వారికి మద్దతుగా ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చింది. సమ్మె శిబిరాల వద్దకెళ్లి సంఘీభావం తెలపాలని కోరింది. మంగళవారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌, జనగాం రాజమల్లు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామపంచాయతీల్లో ఏండ్ల పడాంతరం నుంచి పనిచేస్తున్న కార్మికుల్లో సామాజికంగా వెనుకబడిన దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. నాలుగైదు వేల రూపాలయతో ఇల్లు గడవటం కష్టమవుతున్నదనీ, వేతనాలు పెంచాలని 13 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తు న్నా రాష్ట్ర సర్కారు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసే దిశగా సర్కారు ప్రయత్నాలు చేయడాన్ని తప్పుబట్టారు. పంచాయతీలో పనిచేసే కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలనీ, ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.