నా కూతురు డిగ్రీ వరకు సదవాలే

– గ్రామీణ భారత్‌లోని 78 శాతం మంది తల్లిదండ్రుల్లో ఇదే అభిప్రాయం
– ‘డెవలప్‌మెంట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో బాలికల విద్య పట్ల తల్లిదండ్రుల ఆలోచన మారుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని 78 శాతం మంది తల్లిదండ్రులు వారి కూతుర్లను కనీసం డిగ్రీ వరకు చదివించాలని యోచిస్తున్నారు. డెవలప్‌మెంట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్టేట్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా-2023 పేరుతో ఈ సర్వేను నిర్వహించారు. 6 నుంచి 16 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలున్న తల్లిదండ్రుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలు సేకరించారు. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 6,229 మంది తమ అభిప్రాయాలను సర్వేలో వెల్లడించారు. సర్వేలో వెల్లడైన విషయాల ప్రకారం.. 78 శాతం మంది వారి కూతుర్లను డిగ్రీ వరకు చదివించాలనే అభిప్రాయాన్ని తెలిపారు. కుటుంబాన్ని పోషించటం, ఇంటి పనులను చూసుకోవటం, తోబుట్టువులను చూసుకోవాలనే కారణంగా స్కూళ్లలో బాలికలు డ్రాపౌట్‌ అవుతున్నారని చెప్పారు. చదువులో అనాసక్తి కారణంగా 71.8 శాతం మంది బాలురు స్కూల్‌ డ్రాపౌట్లుగా మిగిలారు. కుటుంబం కోసం సంపాదించటానికి కూడా వారు డ్రాపౌట్‌ అవుతున్నారని 48.7 శాతం మంది చెప్పారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌ యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. అయితే, వీరిలో 76.7 శాతం మంది వీడియో గేమ్స్‌ను ఆడుతున్నారు. 56.6 శాతం మంది సినిమాలు చూస్తున్నారు.47.3 శాతం మంది మ్యూజిక్‌ను వింటుంటే…34 శాతం మంది మాత్రమే స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 18 శాతం మంది మాత్రం ఆన్‌లైన్‌ లెర్నింగ్‌, ట్యూటోరియల్‌ కోసం స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. భారత్‌లోని మూడు రాష్ట్రాల్లో 15-16 ఏండ్ల వయస్సు గ్రూపు విద్యార్థుల్లో పదిశాతానికి పైగా స్కూల్‌కు దూరంగా ఉంటున్నారు. ఇందులో యూపీ (15 శాతం), మధ్యప్రదేశ్‌ (17 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (11.2 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి.