నా భారతదేశం

నా భారతదేశం
నా భారతదేశం
నా భారతదేశం
       సహజ సంపదల, మానవ వనరుల నిలయం
       ఐతిహాసిక నైతిక విలువల ఆలయం
       రహీమ్, తులసీ, కబీర్ ల కవిత్రయం
       గంగ, యమున,సరస్వతీ ల నదీ త్రయం
 నా భారతదేశం
       అత్యంత ప్రాచీన కళలకు కాణాచి
       వినూత్న ఆవిష్కరణల విజ్ఞాన విపంచి
       శాస్త్ర, సాంకేతిక రంగాల విరించి
       సాంఘిక సంస్కరణలకు ఎర్రతివాచి
నా భారతదేశం
       రైతుల సకల పంటల ధాన్యాగారం
       అలుపెరుగని ఆత్మనిర్భర ఆయుధాగారం
       సంఘసంస్కర్తల, వలస మేధావుల కర్మాగారం
       అమరవీరుల, స్వాతంత్ర్య సమరయోధుల కారాగారం
నా భారతదేశం
       సమస్త ప్రపంచానికి నాగరికత నేర్పిన నైజం
       పంచ వేదాల, పురాణేతిహాసాల దివ్య తేజం
      జీవాత్మ పరమాత్మ ల నడుమ దాగిన మోహ పూరిత నిజం
      సర్వ శాస్త్రాల, వ్యవసాయ తొలి  విశ్వ బీజం
నా భారతదేశం
       నూట యాభై  కోట్ల దేశభక్తుల ఐకమత్యం
       ప్రాణాలను తృణీకరించే సైనికుల నిత్య కృత్యం
       కర్మసిద్ధాంతాన్ని ఆచరించే క్రియాశీలక సత్యం
      పరాయి పాలకుల కిరాయి మూకలకు తలవంచని ఆభిజాత్యం
నా భారతదేశం
      అహింసాయుత మార్గంలో విహరించే శాంతి కపోతం
      అపకారికి సైతం ఉపకారం చేసే భూమి పునీతం
      శత్రువునైనా క్షమించే దయార్ద్ర నవనీతం
      వీరోచిత పోరాటాల, నిరుపమాన త్యాగాల ఘన గతం
నా భారతదేశం
       స్వతంత్ర నినాదపు స్వేచ్ఛా తారక మంత్రం
       ఆధునిక శాస్త్రజ్ఞుల అభివృద్ధి సాంకేతిక యంత్రం
       శత్రు దుర్భేద్య, అరివీర భయంకర రణతంత్రం
       సర్వసత్తాక, సార్వభౌమాధికార గణతంత్రం
జై హింద్
  – సయ్యద్ ఖాసీం అలీ
     ప్రిన్సిపాల్,  శ్రీ చైతన్య విద్యాసంస్థలు
      హైదరాబాద్, తెలంగాణ
      9059022889