రాజకీయాల పట్ల, సమాజం పట్ల అవగాహన లేని వయసులో అత్తింట్లో అడుగుపెట్టింది. కమ్యూనిస్టు యోధులైన అత్తమామల అండతో చదువు కొనసాగించింది. వారి అడుగు జాడల్లో నడుస్తూ సాటి మనుషుల కోసం, సమాజం కోసం సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో రాజకీయ రంగంలో ప్రవేశించిన ఓ సాధారణ మహిళ మల్లు లక్ష్మి. నాడు తెలంగాణలో వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థ రద్దుకై సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన వీరనారీమణి, అమరజీవి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం చిన్న కోడలిగా ఆమె మార్గదర్శకత్వంలో ఉద్యమ పాఠాలు నేర్చుకొన్నారు. ఆ మహానాయకురాలి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హుజూర్ నగర్ సీపీఐ(ఎం) ఎంఎల్‌ఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె పరిచయం నేటి మానవిలో…
లక్ష్మి మిర్యాలగూడ నియోజకవర్గం, వేముల పల్లి మండలం, ములకపట్నం గ్రామంలో పుట్టారు. తల్లి రాములమ్మ, తండ్రి జనార్ధన్‌రెడ్డి. ఆమె చిన్నాన్న అప్పట్లో సీపీఎం సర్పంచ్‌గా పని చేశారు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. తండ్రి మాత్రం సీపీఎం అభిమానిగానే ఉన్నారు. లక్ష్మి ఇంటర్ మొదటి ఏడాది చదివేటపుడు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట నర్సింహారెడ్డి చిన్నకొడుకు మల్లు నాగార్జున రెడ్డిని వివాహం చేసుకున్నారు. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన సూర్యాపేట పట్టణంలోని రాయినిగూడెం గ్రామానికి వచ్చారు.
అంచలంచెలుగా ఎదుగుతూ…
ఇంటర్ చేస్తున్న కోడలిని చదువు కొనసాగించేలా అత్తమామలు ప్రోత్సహించారు. అత్త స్వరాజ్యం ప్రోత్సాహంతో ఇంటర్ తర్వాత లైబ్రేరీ సైన్స్ చేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూనే డిగ్రీ చేశారు. పీజీ చేయాలనుకుంటే మామయ్య లా చదవమని సలహా ఇచ్చారు. ఆయన కోరిక మేరకు లా పూర్తి చేశారు. పిల్లలు, ఇంటి బాధ్యతల వల్ల మొదట్లో ఐద్వాలో పని చేసేందుకు లక్ష్మి అంతగా ఆసక్తి చూపించలేదు. అప్పటి ఐద్వా నాయకులు కల్పన ప్రోత్సాహంతో సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐద్వా నాయకులు హైమావతి, స్వరూపరాణి ప్రోత్సాహంతో మోటూరు ఉదయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న లీగల్‌సెల్‌కు నల్లగొండ జిల్లా కన్వినర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుండి అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయికి వచ్చారు. 2007లో జిల్లా ఐద్వా ట్రైజరర్‌గా పని చేసాను. 2011లో ఐద్వా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2017లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా కమిటీ సహాయ కార్యదర్శిగా, 2022లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా ఎన్నికై వివిధ బాధ్యతల్లో పని చేస్తున్నారు. ఇలా కమ్యూనిస్టు యోధులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో అంకిత భావంతో సమాజం కోసం కృషి చేస్తున్నారు.
ప్రజా ఉద్యమాల్లో మమేకమై…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ, మహిళల హక్కుల కోసం, సామాజిక అణిచివేత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సాధన కోసం జరిగిన సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రతి గ్రూపుకు పది లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్‌లు, అభయహస్తం పెన్షన్లు ఇవ్వాలని ఉద్యమించారు. ఇటీవల గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా సాగిన బస్సు యాత్రలో పాల్గొన్నారు. అనేక ఏండ్లుగా చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలని జరిగిన అనేక ఉద్యమాలు నిర్వహిసున్న సందర్భంలో అక్రమ కేసులు, లాఠీ దెబ్బలకు గురయ్యారు. జైలు జీవితం కూడా గడిపారు.
సర్పంచ్‌గా…
2007లో రాయినిగూడెం గ్రామ పంచాయితి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయితీలకు నిధులు రాబట్టేందుకు పాద యాత్ర చేసి ప్రభుత్వం ద్వారా 147 కోట్ల రూపాయలు పోరాడి సాధించారు. ఐద్వా నాయకురాలిగా మద్యపానాన్ని నిషేధించాలని చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించి పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం చీఫ్ లిక్కర్‌ను రద్దు చేసింది. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార అందించాలని పోరాటం చేసి విజయం సాధించారు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికై సాగిన చారిత్రాత్మక మహాజన పాద యాత్ర బృందానికి మద్దతుగా 650 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించారు.
నేను గెలిస్తే….
హుజూర్‌నగర్ నియోజవర్గం పూర్వపు మిర్యాల గూడెం నుండి విడిపోయిన తర్వాత కనీస అభివృద్ధికి నోచుకో లేదు. ఈ ఎన్నికల్లో ఎంఎల్‌ఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ప్రజలు గెలిపిస్తే అన్ని వేళలా అందుబాటులో ఉండి హుజూర్‌నగర్ నియోజవర్గంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషఙ చేస్తాను. సాగు, తాగు నీరు, లిఫ్ట్ ఇరిగేషన్లు చిన్న నీటి ప్రాజెక్టులు చివరి భూములకు నీరందించే విధంగా కృషి చేస్తాను. విద్యా, వైద్యం, ఉపాధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్థాకిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తాను. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ప్రజా సంక్షేమ పథకాలు, మౌళిక వసతుల కల్పన, అంతర్గత, లింకు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తాను. చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులు, దళితులు, గిరిజనలు, బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీలు, విద్యార్థులు, యువకుల హక్కుల కోసం నియోజకవర్గ ప్రజల వెన్నంటి ఉంటూ నిరంతరం పోరాటం చేస్తాను. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపిస్తూ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తాను.