హైదరాబాద్‌లో జాతీయ దళిత సదస్సు

National Dalit Conference in Hyderabad– దేశానికి సమగ్ర దళిత అజెండా ఇవ్వడమే లక్ష్యం
– 26, 27 తేదీల్లో హరిత ప్లాజాలో..
– 26 రాష్ట్రాల నుంచి 80 సంఘాల భాగస్వామ్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశానికి సమగ్ర దళిత అజెండాను ఇవ్వడమే లక్ష్యంగా ఈనెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌ బేగంపేటలోని హరితప్లాజాలో జాతీయ దళిత సదస్సును నిర్వహిస్తున్నట్టు పలు సంఘాలు ప్రకటించాయి. దీనిలో 26 రాష్ట్రాల నుంచి 80 విభిన్న సంఘాలకు చెందిన 300 మంది ప్రతినిధులు భాగస్వామ్యం అవుతారని తెలిపారు. మంగళవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌బాబు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ అనిల్‌కుమార్‌, ఆలిండియా అగ్రికల్చర్‌ రూరల్‌ వర్కర్స్‌ అండ్‌ లేబర్‌ అసోసియేషన్‌ (ఏఐఏఆర్‌ఎల్‌ఏ) ప్రతినిధి సాయిబాలాజీ, భారత్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య మాట్లాడారు. రెండ్రోజుల ఈ జాతీయ సదస్సులో యూజీసీ మాజీ చైర్మెన్‌ సుఖాదియో తోరాట్‌, హర్యానా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రాజశేఖర్‌ ఉండ్రు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఆహ్వాన సంఘం ప్రతినిధులుగా మాజీ ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు, మల్లేపల్లి లక్ష్మయ్య, జాన్‌ వెస్లీ, బాలమల్లేష్‌, రాధికా మీనన్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన పదేండ్లలో దళితులపై దాడులు, అత్యాచారాలు, వివక్ష పెరిగాయనీ, ఆపార్టీ మేనిఫెస్టోలో కనీసం దళితులకు సంబందించిన అజెండానే లేదని అన్నారు. దళిత విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఉద్దేశించిన రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌ వంటి పథకాల్లో కోతలు విధించారని చెప్పారు. ఎస్సీ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధులు, స్కారల్‌షిప్పుల్లోనూ కోతలు విధించారని గుర్తుచేశారు. దళితుల అజెండాను దేశం ముందు పెట్టేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ అజెండా దేశ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేలా ఉంటుందని స్పష్టం చేశారు. అసంఘటితరంగంలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది దళితులే ఉన్నారన్నారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇన్నాళ్లు దళితులను ఓట్‌బ్యాంకుగా చూసారే తప్ప, స్వావలంబన, సాధికారితకు కృషి చేయలేదని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సు జరుగుతుందనీ, భూమి, ఉద్యోగాలు, పరిశ్రమలు సహా అన్నింటా దళితుల వాటాను కచ్చితంగా కోరతామని తెలిపారు. 26, 27 తేదీల్లో జరిగే జాతీయ సదస్సులో చేసే డిక్లరేషన్‌పై అన్ని రాష్ట్రాల్లోనూ సమావేశాలు జరుగుతాయనీ, నవంబర్‌లో జాతీయ స్థాయి సమావేశం ఢిల్లీలో జరుగుతుందని వివరించారు.