– హైదరాబాద్ వేదికగా 26, 27 తేదీల్లో భేటీ
న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో ఈ నెల 26, 27 తేదీల్లో దళిత అజెండాపై జాతీయ సమ్మిట్ నిర్వహించనున్నామని దళిత, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్), రామచంద్ర డోమ్ (దళిత్ శోషణ్ ముక్తి మంచ్), బి. వెంకట్ (అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం), జిఎల్ గోరియా (భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్), విఎస్ నిర్మల్ (అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం), శ్రీరాం చౌదరి (ఆల్ ఇండియా అగ్రికల్చరల్ అండ్ రూరల్ లేబర్ అసోసియేషన్), కర్నైల్ సింగ్ ఇకోలోహా (ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ సభ), ధర్మేందర్ (ఆల్ ఇండియా అగ్రహరి కృషి శ్రామిక్ యూనియన్) తదితరులు మాట్లాడారు.
హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్లాజాలో జరగనున్న సమ్మిట్‌లో దాదాపు వంద దళిత, వ్యవసాయ కార్మిక సంఘాల దేశవ్యాప్తంగా నుంచి 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. యూజీసీ మాజీ చైర్మెన్ సుఖదేయో థోరట్, ప్రముఖ సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌ల నాయకత్వంలో దళిత అజెండా కీ నోట్ రూపొందించి జాతీయ కన్వెన్షన్ ముందుంచనున్నారు.
దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నా దళితులకు దక్కలేదు : బి. వెంకట్
దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నా సాగు భూమి లేని నిరుపేదలుగా దళితులు ఉన్నారు. రాజ్యాంగంలో విద్యా ఉపాధి కల్పన కోసం పొందుపరిచిన రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ప్రయివేటు రంగంలో రాజ్యాంగ హక్కుల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. నరేంద్ర మోడీ తొమ్మిదేండ్ల పాలనలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు పెరిగాయి. దళిత మహిళలపై హత్యలు, లైంగికదాడులు, నగ ఊరేగింపులు పెరుగుతున్న వాటిని అడ్డుకొని వారికి రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు, ప్రభుత్వ రంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్న తీరు, దళితుల రాజ్యాంగ హక్కులు – పాలకుల దాడి, భూ సమస్య – చట్టాలు – భూ సేకరణ, పునరావాసం, అంటరానితనం వంటి అంశాలతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం విశాల ఉద్యమాల రూపకల్పనకు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. దీనిని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.