– పురిటిలోనే పసికందు మృతి
– ఉదయం 10:30 నుంచి రాత్రి 11 గంటల వరకు కాలయాపన
– దండం పెడతానన్న కనికరించలే : బాలింత తల్లి
– బాధ్యులను గుర్తించి సస్పెండ్ చేస్తాం
– ఎంసీహెచ్ సూపరిండెండెంట్ సుగుణాకర్ రాజు
నవతెలంగాణ-పాలకుర్తి
డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గర్భిణీని పట్టించుకోక వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పురిటిలోనే పసికందు మృతిచెందింది. ఈ విషాదకర ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన జిట్టబోయిన రామలీల, సోమల్లు దంపతుల కుమార్తె స్రవంతిని జఫర్‌రగడ్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన కన్నబోయిన చంద్రశేఖర్‌తో గతేడాది వివాహం చేశారు. కాగా, నిండుగర్భిణీ అయిన స్రవరతికి పురిటి నొప్పుడు రావడంతో ఆమె తల్లి.. బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యాధికారి స్వప్న నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేసింది. స్రవంతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పాటు వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. నొప్పులతో స్రవంతి బాధపడుతుందని ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వైద్యులు, వైద్య సిబ్బంది కనికరించలేదు. ఉదయం 10:30 నుంచి పురిటి నొప్పులతో బాధ పడుతున్న స్రవంతిని రాత్రి 10.30కి ఆపరేషన్ థియేటర్‌లోకి స్టాఫ్ నర్స్ సరిత తీసుకెళ్లగా.. పసికందు మృతిచెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న స్రవంతిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, పురిటిలో పసికందు చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేసి పాపను బయటికి తీశారని, వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘దండం పెడతా.. మా పాపను జనగామకు పంపించండి’ అని వేడుకున్నా పట్టించుకోలేదని స్రవంతి తల్లి రామలీల తెలిపారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ, ఐద్వా ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారితో పాటు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో విషయం తెలుసుకొన్న ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. స్రవంతి డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారితో పాటు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తామని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులతోపాటు కుటుంబ సభ్యులకూ భరోసా ఇచ్చారు.
ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్ధన్నపేట ఏసీబీ సురేష్ ఆధ్వర్యంలో పాలకుర్తి ఎస్‌ఐలు తాళ్ల శ్రీకాంత్, యాకూబ్ హుస్సేన్ బందోబస్తు చేపట్టారు.