నితీశ్‌ అసంతృప్తిగా లేరు !

– స్పష్టం చేసిన జేడీయూ
– ఇండియా కన్వీనర్‌గా వుండాలనే కోరిక లేదన్న నితీశ్‌
పాట్నా : ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశం పట్ల బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అసంతృప్తిగా లేరని జనతాదళ్‌ (యునైటెడ్‌) చెప్పింది. నితీశ్‌ అసంతృప్తిగా వున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ ప్రకటన చేసింది. అనంతరం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, తాను సంతోషంగా లేనని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. బెంగళూరు సమావేశంలో జరిగిం దంతా కరక్ట్‌గానే వుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కూటమికి కన్వీనర్‌ గా వుండాలనే కోరిక తనకు లేదని కుమార్‌ మీడియాకు చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను సమైక్యంగా వుంచాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. నలందా జిల్లాలోని రాజ్‌గృ వద్ద మల్మాస్‌ మేళాను ఆయన ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, నితీశ్‌ అసంతృప్తిపై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. అవన్నీ బూటకమని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల బీజేపీ అగ్ర నేతలు భయపడుతున్నారని, అందుకే ఇలాంటి వదతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి పుకార్లు చాలా వస్తున్నాయన్నారు. జేడీయూ చీలిక అంచున వుందని, జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు పెరుగుతున్నాయని, ఇప్పుడు నితీశ్‌ అసంతృప్తిగా వున్నారని – ఇవన్నీ వారి దుష్ప్రచారంలో భాగమేనని అన్నారు. ఇండియాకు సూత్రధారి నితీశ్‌ అని, ఆయన కొనసాగుతారని చెప్పారు. ఇండియా పేరును అందరూ ఏకగ్రీవంగానే ఖరారు చేశారని చెప్పారు. పైగా కన్వీనర్‌గా చేయనందుకు నితీశ్‌ అసంతృప్తిగా వున్నారన్న వార్తలను ఖండించారు. ముంబయిలో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.