వేదిక ఎక్కడైనా సరే… భారీగా జనాన్ని సమీకరిస్తాం

– పరేడ్‌ గ్రౌండ్‌ కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోంది
– ఎల్బీ స్డేడియం ఇస్తారో, లేదో తెలియదు
– రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు
– ఐదు హామీలు, మ్యానిఫెస్టో విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పరేడ్‌ గ్రౌండ్‌ ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతున్న వరంగల్‌ సభను పరేడ్‌ గ్రౌండ్‌కు మార్చుతున్నట్టు ప్రకటించిందని తెలిపారు. అక్కడ సభ పెడతామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర దాగుందని ఆరోపించారు. బహిరంగ సభ నిర్వహణకు ఎల్బీ స్టేడియం ఇవ్వాలంటూ అనుమతి కోరామనీ, అది కూడా ఇస్తారో, లేదో తెలియదని వాపోయారు. వేదిక ఎక్కడైనా సరే తమ లక్ష్యం పది లక్షల జనాన్ని సమీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో రేవంత్‌ అధ్యక్షతన టీపీసీసీ అత్యవసర కార్యవర్గం సమావేశమైంది. తాజా రాజకీయాలు, ఈనెల 16న నిర్వహించబోయే సీడబ్ల్యుసీ సమావేశం, 17న బహిరంగ సభకు జనసమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచుకు నెట్టేసిందని విమర్శించారు. 16,17, 18 తేదీల్లో చేపట్ట బోయే పలు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు వచ్చి ఏర్పాట్లను సమీక్షిస్తారని తెలిపారు. 17న బహిరంగసభలో సోనియా గాంధీ ఐదు హామీలను ప్రకటిస్తారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభత్వం తమ పార్టీకి కుట్రదారుగా మారిందని విమర్శించారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రెండవ ఆప్షన్‌గా ఎల్బీ స్టేడియం అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదన్నారు. ఓఆర్‌ఎస్‌ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమాలు
119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించాలి.
ఏఐసీసీ అగ్రనేతలు 17న రాత్రి నియోజక వర్గాలకు వెళ్లి అక్కడే నిద్రించి మరుసటి రోజు ప్రాంతీయ సభల్లో పాల్గొంటారు.
గతేడాది సెప్టెంబర్‌ 7న రాహుల్‌ జోడో యాత్ర ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఈనెల 7న మండల, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించాలి. ఉత్సవాలు జరపాలి.
భారీ జనసమీకరణపై దృష్టి సారించాలి.