– అన్ని జోన్‌ల హెడ్‌లను హెచ్చరించిన రైల్వే బోర్డు
న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదానికి ముందే ఉన్నతాధికారులను రైల్వే బోర్డు హెచ్చరించింది. సిగలింగ్ సిబ్బంది ఉపయోగిస్తున్న షార్ట్‌కట్ పద్దతులు వద్దని సూచించింది. ఆ పద్దతులను తొలగించే విధంగా కార్మికులను ఆదేశించాలని అన్ని జోన్‌ల హెడ్‌లను బోర్డు అప్రమత్తం చేసింది. రైల్వేలోని వివిధ జోన్లలో చోటు చేసుకున్న ప్రమాదాలకు సంబంధించిన ఐదు అసురక్షిత ఘటనలను ఉదాహరణలుగా పేర్కొంటూ ఉన్నతాధికారులకు రాసిన లేఖలో రైల్వే బోర్డు వివరించింది. ఈ ఐదింటిలో రెండు పట్టాలు తప్పిన ఘటనలూ ఉన్నాయి. ఈ అంశాలను సేఫ్టీ మీటింగ్ లలో సమీక్షించుకోవాలని అందరు జనరల్ మేనేజర్ల ను(జీఎం) బోర్డు ఆదేశించింది. షార్ట్‌కట్ పద్దతులను పాటించొద్దని తరచూ ఆదేశిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి లో మాత్రం మెరుగుదల కనబడటం లేదని లేఖలో బోర్డు పేర్కొన్నది. కాగా ఈ లేఖను బోర్డు ఏప్రిల్ 3న రాసింది. ఈనెల 2న బాలసోర్‌లో మూడు రైళ్లు ఢ కొని దాదాపు 289 మంది చనిపోగా, 900 మందికి పైగా గాయాలపాలైన విషయం విదితమే. దేశంలోనే కాకుండా అంతర్జాతీ యంగానూ ఈ ప్రమాదం అనేక దేశ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాద ఘటనపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్), కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ లు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.