పాలేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాళ నామినేషన్‌

నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
పాలేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డి బుధవారం ఖమ్మం రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ అందజేశారు. సాయి గణేష్‌ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి రెడ్డిపల్లిలోని మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీతో తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఓ రాజేశ్వరికి నామినేషన్‌ అందజేశారు. నామినేషన్‌ అనంతరం కందాల మాట్లాడుతూ కొంతమంది డబ్బు మదంతో, అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాలేరు ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కొనాలని చూస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పాలేరులో కందాళ గెలుపును ఎవరూ ఆపలేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ చంద్రావతి, ఖమ్మంరూరల్‌ ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ వర ప్రసాద్‌, పలువురు టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.