భూ ఆక్రమణ వ్యవహారంలో ఎమ్మెల్యే అరెకెపూడికి నోటీసులు

హైదరాబాద్‌: భూఆక్రమణల వ్యవహారం పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేతోపాటు జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌, ఎస్‌ఐ మల్లేశ్వర్‌, ఇతర పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. సర్వే నంబర్‌ 38/8, 38/9లో గల భూమిని తన పేర రిజిస్ట్రేషన్‌ చేయ్యాలని బెదిరించారని ఎమ్మెల్యే గాంధీపై సులోచన అగర్వాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జీడిమెట్లలోని ఫెన్‌స్ట్రేషన్‌ సిస్టమ్స్‌ ప్క్రెవేట్‌ లిమిటెడ్‌లోకి అర్ధరాత్రి గాంధీ మనుషులు ఫ్యాక్టరీలో దోపిడీ చేశారని, దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీస్‌ అధికారులు స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.తమకు భద్రత కూడా కల్పించాలని కోరారు. దీనిని విచారించిన జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ పిటిషనర్‌ లాయర్‌కు సూచించారు. విచారణను ఆగస్టు 10కి వాయిదా వేశారు.
కేంద్ర అధికారుల కేసు విచారణ వాయిదా
సెంట్రల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్లను తెలంగాణ, ఏపీలకు విభజన చేసిన తీరును తప్పుపుడుతూ దాఖలైన కేసుల విచారణ వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌గా చేసిన సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించడాన్ని సమర్ధించిన హైకోర్టు ఉత్తర్వులు డీజీపీ అంజనీకుమార్‌ ఇతర అధికారులకు అమలు చేయాలని కేంద్ర కోరింది. సోమేశ్‌కుమార్‌ కేసులో తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ పిటిషన్‌ వేశామని, దీనిపై తీర్పు వచ్చే వరకు ఇతర అఫీసర్ల కేసుల విచారణ వాయిదా వేయాలని రాష్ట్రం కోరింది. దీంతో విచారణ 2 వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్‌ అభినందకుమార్‌ షావిలి, జస్టిస్‌ పుల్లా కార్తీక్లలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
భూమి కేటాయింపుపై పిల్‌
రంగారెడ్డి జిల్లా షేక్‌పేటలోని సర్వే నంబర్‌ 403లో 4.18 ఎకరాలను రెడ్‌ ఫోర్ట్‌ అక్బర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాష్ట్రం కేటాయించడాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో రాష్ట్రీయ వానరసేన పిల్‌ దాఖలు చేసింది. దీనిని సోమవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఆ భూమిలో జరిగే నిర్మాణలన్నీ హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలంది. విచారణను ఆగస్గు 9కి వాయిదా వేసింది.
బీజేపీ ధర్నాకు అనుమతివ్వండి…
పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఇందిరాపార్క్‌ వద్ద ఈ నెల 25 తేదీ బీజేపీ ధర్నా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 500 మందితోనే ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశించింది. ధర్నా పేరుతో ర్యాలీ నిర్వహించరాదని, శాంతిభద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నా పేరుతో సచివాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందని, ర్యాలీ కూడా నిర్వహిస్తే సమస్యలు వస్తాయని ప్రభుత్వం చెప్పింది. ఆవిధంగా చేయబోమని బీజీపీ జనరల్‌ సెక్రెటరీ వేసిన పిటిషనర్‌ తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు.