– 21న లాటరీ
– షెడ్యూల్ ప్రకటించిన ఆబ్కారీ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 2023-25 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తున్నది. ముందుగా ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు సంబంధించిన షాపులను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గుర్తించనున్నారు. అనంతరం లైసెన్స్‌ల జారీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 4న జారీచేయనుంది.
ఆ రోజు నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీ సాయంత్రం 6గంటలకు ముగియనుంది. 21వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాటరీ ద్వారా దుకాణాలను అధికారులు కేటాయించనున్నారు. లైసెన్స్ ఫీజులో మొదటి వాయిదాను 21, 22 తేదీల్లో చెల్లించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. అయితే లాటరీ ద్వారా దక్కించుకున్న కొత్త షాపులకు నవంబర్ 30 తర్వాతనే స్టాక్ పంపించాలని, డిసెంబర్ 1న వాటిని తెరవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 2300 మద్యం దుకాణాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 700 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో ప్రతి రోజూ రూ.150కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఆబ్కారీ శాఖ నుంచే అధికంగా ఉంది. గతేడాది ఈ శాఖ నుంచి రూ.33వేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.