కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే
– మరణించిన వారికి సీపీఐ(ఎం) సంతాపం
– సమగ్ర దర్యాప్తు జరిపించాలని తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహగానా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ఈ ప్రమాదం జరిగేందుకు కారణమని తెలిపింది. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు సుమారు 300 మంది ప్రయాణికులు మరణించినట్టు, వెయ్యి మంది తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వివరించారు. ప్రయాణికుల్లో సుమారు 170 మంది తెలుగు వారున్నారని, కొద్దిమంది చికిత్స పొందుతున్నట్టు వార్తలొస్తున్నాయని తెలిపారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. వేలాదిమంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల సొబగుల కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. అదే సమయంలో రైల్వేలైన్లు, సిగల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. రైల్వేశాఖలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ట్రాక్ పర్యవేక్షణ, తదితరాల్లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, గాయపడినవారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేశారు. రైల్వే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మోడీదే నైతిక బాధ్యత : కూనంనేని
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతులకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. భారత రైల్వేలో కవచ్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అరికట్టనున్నట్టు మోడీ ఘనంగా ప్రకటించారని, అలాంటప్పుడు ఈ ప్రమాదానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రూ.కోట్లు ఖర్చుతో రూపొందించిన ఆ పరిజ్ఞానాన్ని రైల్వే స్టేషన్లు, రైల్వేల్లో ఎందుకు అమర్చలేదని తెలిపారు. ప్రయివేటీకరణతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రయివేటు వ్యక్తులు లాభాలే పరమావధిగా భావించి ఉద్యోగులను తగ్గించి, పనిచేస్తున్న వారిపై భారాలు మోపుతారని విమర్శించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంతో వందల మంది ప్రాణాలను బలిగొన్నదని తెలిపారు. ఇప్పటికైనా రైల్వే ప్రయివేటీకరణను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి : ప్రజాపంథా
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇది ప్రమాదమే కాదని, రైల్వే శాఖ నిర్లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. రైల్వే ప్రయివేటీకరణతో ఉన్న వారిపై పనిభారం పెరగడం, సిగల్ వ్యవస్థలో లోపాలుండం వల్ల వందల మంది మరణానికి కారణమైందని పేర్కొన్నారు. మరణించిన వారిలో ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలిపారు. దీనికి నైతిక బాధ్యత వహించి రైల్వే శాఖ మంత్రి, ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.