నాడు అసౌకర్యాల్లో నెంబర్‌ వన్‌

– నేడు అభివృద్ధిలో నెంబర్‌ వన్‌
– విలేకరుల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాక మునుపు అసౌకర్యాలలో నెంబర్‌ వన్‌గా ఉన్న రాష్ట్రం, స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ గా రూపొందిందని, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ప్రజలు మద్దతుగా నిలిచి బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్‌ఎస్‌ లోక్‌ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేటలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ నామ ఈ సందర్భంగా అశ్వారావుపేట లో జరిగిన విలేకరుల సమావేశంలో మెచ్చా నాగేశ్వరరావుతో కలసి మాట్లాడారు. వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మూడోసారి కెసిఆర్‌ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును అడ్డుకున్నానని రాహుల్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని,అసలు ఆయన పార్లమెంట్‌ కే రాలేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ నుంచి పారదోలాలని పిలుపు నిచ్చారు. త్వరలో జరిగే అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నామ విజ్ఞప్తి చేశారు. రైతు బిడ్డగా రైతుల సమస్యలు దగ్గరగా చూశానని చెప్పారు. నీళ్లు, కరెంట్‌, పెట్టుబడి లేక అప్పులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర గతంలో ఉండేదని, కేసీఆర్‌ వచ్చిన తర్వాత పరిస్థితి బాగుపడిందన్నారు. రైతు సంక్షేమ రాజ్యం తీసుకు వచ్చారని చెప్పారు.
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పరిశీలన: ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు తో కలసి అశ్వారావుపేట సీఎం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ విజయవంతానికి పార్టీ నాయకులకు నామ పలు సూచనలు చేశారు. భారీగా తరలివచ్చి, సభను జయప్రదం చేయాలని నామ ప్రజలను కోరారు.