– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ: ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)కి కేటాయింపులు తగ్గించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌పై పార్లమెంటరీ కమిటీ మండిపడింది. ఇది గ్రామీణ ఉపాధి పథకం కింద జరుగుతున్న పనులకు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేటాయింపులో కోత వెనుక కారణాన్ని వివరించనందుకు ప్యానెల్ గ్రామీణాభివద్ధి శాఖను ప్రశ్నించింది. కేంద్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 60,000 కోట్లతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకి ఈ సంవత్సరం బడ్జెట్‌లో కోత పెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం కేంద్రం రూ.73,000 కోట్లు కేటాయించింది. అయితే, బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు రూ.89,400 కోట్లుగా ఉండటం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల దశ నుంచి రూ. 29,400 కోట్లు బాగా తగ్గినట్టు ప్యానెల్ పేర్కొన్నది. ఉపాధి హామీ పథకం కింద జనవరి 25 నాటికి కేంద్రం రూ.6,231 కోట్ల వేతనాలు, రూ.7,616 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్స్ పెండింగ్‌లో ఉందని గురువారం లోక్‌సభలో సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ ఎత్తిచూపింది. ”2020-21, 2021-22, 2022-23 సంవత్సరాలలో సవరించిన అంచనాల దశలో పథకం చూపిన పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదిత డిమాండ్ రూ. 98,000 కోట్లుగా పరిగణించబడుతుంది. ఉపాధి హామీ కింద ఉద్యోగాల కోసం డిమాండ్‌కు సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితిని వాస్తవికంగా అంచనా వేయడమే కాకుండా ఉపాధి హామీకి పెరిగిన కేటాయింపుల కోసం కమిటీ గట్టిగా సిఫారసు చేసింది” అని ప్యానెల్ వివరించింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిన ఉపాధి హామీ పథకంపై కేంద్రం చిన్న చూపు చూస్తున్నదని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటికేడు పథకానికి జరుపుతున్న కేటాయింపుల్లోని కోతలే ఇందుకు నిదర్శనమన్నారు. మొత్తానికి మాత్రం పథకాన్ని నీరు గార్చే ప్రయత్నాన్ని మోడీ సర్కారు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.