పెండ్లికాని తల్లి జీవితం ఈ సమాజంలో ఎలా ఉంటుందో ఊహించగలం. కానీ ఆమె మాత్రం అడ్డంకులనే తన అవకాశాలుగా మార్చుకుంది. జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. ఒకప్పుడు పూట గడవడం కోసం ఏడు కిలో మీటర్లు కొండలు, గుట్టలు ఎక్కి సాహసం చేసింది. ఇప్పుడు తనలాంటి మహిళలెందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే యాంగ్‌మిలా జిమిక్… ఓ ఆహార సంస్థను స్థాపించి తాను బతుకుతూ కొందరిని బతుకునిస్తున్న ఆమె స్ఫూర్తిదాయక పరిచయం…
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో పుట్టిన యాంగ్‌మిలా తన సొంత గ్రామమైన ఫారూంగ్ నుండి ఉఖ్రుల్ పట్టణానికి వెళ్లడానికి ప్రతిరోజూ ఉదయం 7 కి.మీ ట్రెక్కింగ్ చేసేది. అంతేనా బుట్ట నిండా కూరగాయలు నింపుకొని వీపుపై మోసుకెళ్లేది. వాటిని అమ్ముకుని అంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేది. మధ్యాహ్న భోజనం పూర్తి చేసి కూరగాయల పుట్టతో మళ్లీ ట్రెక్క్‌ంగ్ మొదలుపెట్టేది. వాస్తవానికి ఈ నాగ మహిళ ఏరి కోరి ఎంచుకున్న జీవితం కాదు ఇది. పరిస్థితులు ఆమెతో కూరగాయలు అమ్మేలా చేశాయి. ఆమె 1991లో 21 ఏండ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. అయితే ఆమెకు వివాహం జరగలేదు.
మీద పడ్డ బాధ్యతలతో…
యాంక్‌మిలాకు తనను గర్భవతిని చేసిన వ్యక్తితో కలిసి జీవించడం ఇష్టం లేదు. అయితే తన కడుపున పుట్టిన బిడ్డను, ఆనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆమెపై పడింది. మీదపడ్డ బాధ్యతలతో 2002 వరకు కష్టతరమైన ప్రయాణాలను కొనసాగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితలో కొన్ని మార్పులు వచ్చాయి. ‘నేను మొదట సెకండ్ హాండ్ బట్టలు అమ్మడం ప్రారంభించాను. కొన్నేండ్ల తర్వాత జీవనోపాధి కోసం కోళ్ళ పెంపకం ప్రయత్నించాను. 2016లో ఓ ఎన్‌జీఓ ద్వారా శిక్షణ పొంది ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాను. అప్పుడు నా జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడింది’ అని ఆమె పంచుకుంది.
ఆహార ఉత్పత్తులతో…
ఐదు వందల రూపాయల పెట్టుబడితో స్టార్టప్‌ని ప్రారంభించిన ఆ ఒంటరి తల్లి మొదట్లో క్యాండీలపై దృష్టి పెట్టింది. జామకాయ, మామిడి, అడవి ఆలివ్, యాపిల్, అంజీర్, పీచు మొదలైన వాటిని ప్రాసెస్ చేసి వాటిని క్యాండీలుగా తయారు చేసేది. స్థానికులకు ఆమె ఉత్పత్తులు ఎంతో నచ్చాయి. దాంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ ఉత్సాహంతో ఆమె స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరయింది. మిర్చి, వెల్లుల్లి, పెరిల్లా గింజలు, చేదు వంకాయలు, వెదురు రెమ్మలు, నక్కలు వంటి ఇతర వస్తువులతో సేంద్రీయ ఊరగాయలను తయారు చేయడం ప్రారంభించింది. కెవికె వ్యవసాయ పరిశోధనలు చేసి, రైతులు వారి వ్యవసాయ పద్ధతులు, ఉత్పాదకతను మెరుగు పరుచుకునేందుకు సహకరిస్తుంది. ఇందు కోసం స్థానిక సంఘాలతో అనుసంధా నించబడిన వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు అవి. ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో భాగంగా పనిచేస్తాయి.
మాన్యువల్‌గానే జరుగుతుంది
‘నేను నా స్టార్టప్‌కి ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టాను. షిరిన్ అనేది తంగ్‌ఖుల్ నాగా పదం. అంటే ‘ధనవంతులు, పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వబడుతుంది’ అని అర్థం. గూస్బెర్రీ మిఠాయి దాని మొదటి ఉత్పత్తి’ అని యాంగ్‌మిలా చెప్పారు. తన ఉత్పత్తుల తయారీ కోసం ఆమె తన గ్రామమైన ఉఖ్రుల్‌లోని వ్యూలాండ్‌లో ఒక వర్క్ షెడ్‌ను ఏర్పాటు చేసుకుంది. అక్కడ పని ఎక్కువ శాతం మాన్యువల్‌గానే జరుగుతుంది. అయితే కొన్ని ఇతర పనుల కోసం రేకు సీలర్, హాట్ ఎయిర్ గన్ లేదా బ్లోవర్, గ్రైండర్ వంటి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. ఆమెకు తన గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఆమెకు తాజా కూరగాయలు, పండ్లను అందిస్తారు.
మార్కెట్ విస్తరించింది
కొంతకాలం కిందట ఆమె స్టార్టప్ జర్మనీకి చెందిన ఓ స్వచ్చంధ సంస్థ నుండి 1.2 లక్షల రూపాయల గ్రాంట్‌ను అందుకుంది. ఇది ఆర్‌బీఐ పరిధిలో ఉన్న రుణ వేదిక రంగ్ దే నుండి రెండు లక్షల రూపాయల రుణాన్ని కూడా తీసుకుంది. షిరిన్ ప్రొడక్ట్స్ ఈ రోజు నాగా హిల్స్‌లోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, న్యూ ఢిల్లీలో కూడా మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది ఫేస్‌బుక్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తుంది.
ఇంటింటికీ తిరిగి
‘ప్రారంభంలో మేము కేవలం ఒక కార్మికుడితో ఇంటింటికి తిరిగి అమ్మకాలు చేసేవాళ్లం. నేను కూడా ఇంటికి తిరిగి అమ్ముకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా దగ్గర ఆరుగురు పర్మినెంట్ కార్మికులతో పాటు మరో ఆరుగురు తాత్కాలిక కార్మికులు ఉన్నారు. వారందరూ నా దగ్గర శిక్షణ పొందిన యువకులే. యువతకు ఉపాధి కల్పించగలిగినప్పుడు నా సంతోషం మాటల్లో చెప్పలేనిది. అది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది’ అని యాంగ్‌మిలా పంచుకుంది. ఆమె కొడుకు షాంగ్రీఫావో, ఫారెస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇప్పుడు తల్లి ప్రారంభించిన వ్యాపార వెంచర్‌లో సహాయం చేస్తున్నాడు.
మమ్మల్ని బతికించడం కోసం…
‘ఒంటరి తల్లిగా ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జీవనోపాధి కోసం 12 ఏండ్ల పాటు ఉఖ్రుల్‌కు రోజుకు రెండుసార్లు ట్రెక్కింగ్‌లు చేసేది. ఇదంతా మమ్మల్ని బతికించుకోవడం కోసమే” అని ఆమె కొడుకు చెబుతున్నాడు. ఆరేండ్ల వయసులో అతన్ని తాత నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు తీసుకెళ్లాడు. ‘ఇది మా తాత నిర్ణయం. అయితే నేను తన నుండి దూరంగా వెళ్తున్నందుకు మా అమ్మ చాలా బాధగా ఉంది. కానీ ఆమె నా భవిష్యత్తు, విద్య గురించి కూడా ఆందోళన చెందింది. అందుకే నన్ను పంపించింది’ అని షాంగ్రీఫావో తన కష్ట సమయాలను గుర్తు చేసుకుంటూ చెప్పాడు.
దమ్మున స్త్రీ ఆమె
సుమారు 10 ఏండ్ల కిందట మింగ్‌మిలా కొడుకు ఉఖ్రుల్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుండి తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ‘నేను నా తల్లిని చూసి గర్వపడుతున్నాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని దమ్మున్న స్త్రీ ఆమె’ అని ఆమె కొడుకు పంచుకుంటున్నాడు. తన కృషికి గుర్తుగా యాంగ్‌మిలా విజయ లక్ష్మి దాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డుతో పాటు అస్సాం మహిళా పారిశ్రామికవేత్తల అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వ్యవస్థాపక స్ఫూర్తికి, గ్రామీణ మణిపూర్‌లో ప్రభావాన్ని సృష్టించినందుకు ఆమెకు ఎన్నో గౌరవాలు లభించాయి. అంతేకాదు ఆహార భద్రత, పరిశుభ్రత గురించి ప్రసంగాలు చేసేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు ఆమెను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆమెను ఆహ్వానిస్తుంటారు.
యువతకు ఉపాధినిస్తూ…
‘ఆమె స్కూల్ డ్రాపౌట్. అంతేకాదు ఆమెతో పనిచేసే వారందరు కూడా స్కూల్ డ్రాపౌట్సే. వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఆమె నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. తద్వారా వారు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి జీవితంలో ఆర్థికంగా స్థిరపడేలా చేయగలుగుతున్నారు’ అని స్థానిక యువజన నాయకుడైన మషుంగ్మీ జింగ్‌ఖారు ఆమె గురించి స్ఫూర్తిదాయకంగా చెబుతున్నారు.