– టైటిల్ పోరులో సాత్విక్ జోడీ ఓటమి మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్
కౌలాలంపూర్ కలల జోరుకు అనూహ్య కళ్లెం పడింది. పురుషుల డబుల్స్ టైటిల్ వేటలో వరల్డ్ నం.2 సాత్విక్, చిరాగ్‌లకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ నం.1 చైనా షట్లర్లు మనోళ్లపై ఉత్కంఠ పోరులో పైచేయి సాధించారు. బిడబ్ల్యూఎఫ్ 1000 టోర్నీలో సాత్విక్, చిరాగ్‌లు రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
నవతెలంగాణ-కౌలాలంపూర్
మలేషియా ఓపెన్‌లో భారత డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి టైటిల్ వేటకు ఊహించని ముగింపు ఎదురైంది. ఒత్తిడిలో స్ఫూర్తిదాయక విజయాలు నమోదు చేస్తూ అంతిమ సమరానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్.. టైటిల్ పోరులో తడబడ్డారు. ఒత్తిడిని జయించటంలో ప్రత్యర్థిని అందుకోలేకపోయారు. మూడు గేముల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్స్‌లో 21-9, 18-21, 17-21తో మనోళ్లు పరాజయం చెందారు. వరల్డ్ నం.1 జోడీ, చైనా స్టార్స్ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లు పురుషుల డబుల్స్ చాంపియన్స్‌గా అవతరించారు. లియాంగ్, చాంగ్ జోడీ చేతిలో సాత్విక్, చిరాగ్‌లకు ఇది నాల్గో పరాజయం. గత ఏడాది కొరియా ఓపెన్ ఫైనల్లో చైనా జోడీని ఓడించిన సాత్విక్, చిరాగ్‌లు మళ్లీ ఆ ప్రదర్శన పునరావృతం చేయలేదు. 2013 ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లోనూ సాత్విక్, చిరాగ్‌ల టైటిల్ వేటకు చైనా షట్లర్లే అడ్డునిలిచిన సంగతి తెలిసిందే.
గట్టిగా పోరాడినా..
వరల్డ్ నం.3, వరల్డ్ నం.9 జోడీలపై వరుస గేముల్లోనే విజయం. ఫైనల్స్ వరకు ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ను సైతం కోల్పోలేదు. సెమీఫైనల్లో ఏకంగా ఆరు గేమ్ పాయింట్లు కాచుకుని మరీ గెలుపొందిన అసమాన రికార్డు. దీంతో సహజంగానే టైటిల్ పోరులో తెలుగు తేజం సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీపై అంచనాలు భారీగా పెరిగాయి. కొత్త ఏడాది తొలి సూపర్ సిరీస్ సాధిస్తారనే నమ్మకం రెట్టింపు అయ్యింది. అంచనాలను నిజం చేస్తూ మనోళ్లు ఫైనల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. 21-9తో ఏకపక్షంగా తొలి గేమ్‌ను గెల్చుకున్నారు. చైనా షట్లర్లు ఏ దశలోనూ సాత్విక్, చిరాగ్‌లకు పోటీ ఇవ్వలేకపోయారు. 4-0తో మొదలెట్టిన సాత్విక్, చిరాగ్‌లు విరామ సమయానికి 11-4తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచారు. ద్వితీయార్థంలోనూ మనోళ్లు జోరు తగ్గలేదు. కానీ రెండో గేమ్ భిన్నంగా సాగింది. 1-1, 2-2తో మొదలైన రెండో గేమ్‌లో చైనా జోడీ ముందంజ వేసింది. 8-2తో ఆరంభంలోనే భారీ ఆధిక్యం సాధించారు. 11-6తో విరామ సమయానికి ముందంజ వేశారు. సెకండ్‌హాఫ్‌లో సాత్విక్, చిరాగ్‌లు పుంజుకునే ప్రయత్నం చేసినా.. అవేవీ ఫలించలేదు. చైనా జోడీతో సమవుజ్జీగా నిలువలేదు. 21-18తో రెండో గేమ్ సాధించి.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు. ఇక డిసైడింగ్ గేమ్ అందుకు తగినట్టుగానే సాగింది. అధిపత్యం చేతులు మారుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. సాత్విక్, చిరాగ్‌లు ఆరంభంలో మెప్పించారు. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి విరామ సమయానికి 11-8తో ఆధిక్యం సాధించారు. కానీ చైనా షట్లర్లు వేగంగా పుంజుకున్నారు. 12-12తో స్కోరు సమం చేశారు. 14-14 తర్వాత.. సాత్విక్, చిరాగ్‌లు ఒత్తిడిలో పడిపోయారు. 16-14, 18-16తో చైనా జోడీ ఆధిక్యం నిలుపుకుంది. ఆఖర్లో వరుస పాయింట్లతో 21-17తో మూడో గేమ్‌తో పాటు సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 58 నిమిషాల టైటిల్ పోరులో వరల్డ్ నం.2 సాత్విక్, చిరాగ్‌లు అద్భుత ప్రదర్శన చేశారు. కానీ టైటిల్ చేతికందే సమయంలో ఒత్తిడికి లోనై.. రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్నారు.
మలేషియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అన్ సీ యంగ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో తైజుయింగ్ (చైనీస్ తైపీ)పై 10-21, 21-10, 21-18తో యంగ్ (దక్షిణ కొరియా) గెలుపొందింది. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ షి యు కిపై 21-14, 21-13తో డెన్మార్క్ షట్లర్ ఆండర్స్ ఆంటోన్సెన్ వరుస గేముల్లో గెలుపొంది టైటిల్ నెగ్గాడు. మహిళల డబుల్స్ విభాగంలో చైనా షట్లర్లు లి షెంగ్ షు, టాన్ నింగ్ జోడీ..మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో జపాన్ జోడీ యుట, అరిసాలు చాంపియన్లుగా నిలిచారు.
గతంలోనూ ఇలాగే..!
వరల్డ్ నం.1 చైనా జోడీ చేతిలో పరాజయానికి రానున్న టోర్నీల్లో లెక్క సరి చేస్తామని ఆసియా క్రీడల చాంపియన్స్ సాత్విక్, చిరాగ్‌లు అన్నారు. మలేషియా ఓపెన్ ఫైనల్స్ అనంతరం సాత్విక్ మాట్లాడాడు. ‘మలేషియా ఓపెన్‌లో మా ఆట పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. చివర్లో ఒత్తిడిని నియంత్రణలో నిలుపుకోలేదనే చిన్న అసంతృప్తి ఉంది. మూడో గేమ్ చివర్లో ఎదుర్కొన్న ఒత్తిడికి మించి ఒత్తిడిని మ్యాచ్‌లో ఎదుర్కొని ముందుకుసాగాం. కనీసం 4-5 పాయింట్ల ఆధిక్యంలో నిలవాలని అనుకున్నాం. కానీ అనుకున్నట్టు జరుగలేదు. 12-12తో స్కోరు సమమైంది. ఇక్కడే కాదు గతేడాది ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లోనూ ఇలాగే జరిగింది. చైనా షట్లర్లు పుంజుకుంటారని అనుకున్నాం కానీ.. మేము ప్రశాంతంగా ఆడలేకపోయాం. ఈ ఓటమి నుంచి నేర్చుకుని.. వారితో రానున్న పోరులో సత్తా చాటుతామని’ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి అన్నాడు.