– పలు ఉద్యోగ సంఘాల మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి నిర్వహించబోయే పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల గుండా సీపీఎస్ రద్దు కోసం పాత పెన్షన్‌ను పునరుద్ధరించడానికి ఈ రథయాత్రను చేపడుతున్నది. సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం చేపట్టే ఈ రథయాత్రతోపాటు ఆగస్టు 12న చలో హైదరాబాద్ కార్యక్రమాలకు ఈ రథయాత్రకు టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, అగ్రి కల్చర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు దర్శన్ గౌడ్, కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు, నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.