గ్రామపంచాయతీ కార్మికులపై

– సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు
– సీఎం తన ప్రసంగంలో కీలక నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం
– గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై శాసనసభ, మండలిలో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఆదివారం నాడు సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో కీలక నిర్ణయం ప్రకటిస్తున్నారని ఆశిస్తున్నామని పేర్కొంది. శనివారం ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ, కన్వీనర్లు వెంకటరాజం, పి.అరుణ్‌కుమార్‌, శివబాబు, ఎన్‌.దాసు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాసనసభ, మండలి సమావేశాల్లో 20 మందికిపైగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మాట్లాడటాన్ని స్వాగతించారు. 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె కు విశాల మద్దతు మద్దతు దక్కుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడే సందర్భంలోనైనా గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు, కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు పదోన్నతులు, ఆరోగ్య, ప్రమాద బీమా, మల్టీ పర్పస్‌ విధానం రద్దు తదితర అంశాల పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.