సెప్టెంబర్‌ 4,5వ తేదీల్లో..

On September 4 and 5.– తెలంగాణ చేనేత కార్మిక సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభలు
– సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్‌
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ చేనేత కార్మిక సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్‌ 4, 5వ తేదీల్లో నల్లగొండ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలకేంద్రంలోని చేనేత కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నేటి తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలపై 70 ఏండ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఆందోళనా పోరాటాలను నిర్వహించామని తెలిపారు. చేనేత వస్త్ర పరిశ్రమకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ చేనేత బోర్డుతో పాటు మహాత్మాగాంధీ బోనకల్‌ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెల్త్‌ స్కీమ్స్‌, హౌస్‌ కం వర్క్‌ లాంటి కేంద్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత పరిశ్రమ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేనేత కార్మికులందరూ ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకుపోయి సంఘంలోని సభ్యులకు పని కల్పించలేని పరిస్థితిలోకి నెట్టి వేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చేనేత కార్మికులకు అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో చేనేత సహకార సంఘాలు, సహకార ఇతర రంగంలో పనిచేస్తున్న కార్మికుల వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్నాటి శ్రీరంగం, రావిరాల వెంకటేశ్వర్లు, రాపోలు అయోధ్య, రాపోలు జనార్దన్‌, రాపోలు గోవర్ధన్‌, రాపోలు పద్మ, రావిరాల ధనమ్మ, చెరువుపల్లి వెంకటయ్య, కుక్కుల యాదగిరి, కొలను సత్యనారాయణ, కొలను శంకరయ్య, పొట్టబత్తుల పరమేష్‌, కొక్కుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.