అవకాశవాద డబ్బు రాజకీయాలను తిప్పికొట్టాలి

– సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన నాయకులను చట్టసభలకు పంపించాలి
– 9న పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం నామినేషన్‌ను జయప్రదం చేయండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌
నవతెలంగాణ-నేలకొండపల్లి
ఈనెల 30న జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో అవకాశవాద డబ్బు రాజకీయాలను తిప్పి కొట్టి, స్వచ్ఛమైన రాజకీయాలను స్వాగతించేలా సీపీఐ(ఎం) పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని వీరభద్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌ పిలుపునిచ్చారు. ఈనెల తొమ్మిదిన తమ్మినేని వీరభద్రం నామినేషన్‌ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మండల వ్యాప్తంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరులో అధికార మదం, డబ్బు అహంకారం, స్వచ్ఛమైన నీతివంతమైన రాజకీయాల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రష్టు పట్టించేలా పాలక కొన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను సైతం తమ అధికార మదం, అహంకారం డబ్బు రాజకీయాలతో కలుషితం చేస్తూ పక్కదారి పట్టించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛమైన, నీతివంతమైన వ్యవస్థను ఎంపిక చేయడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అవరోధంగా మారాయన్నారు. ప్రజలు ప్రస్తుత రాజకీయ సమీకరణలు, మార్పులను నిశితంగా పరిశీలిస్తూ భావి భవిష్యత్తును నిర్దేశించడంలో చైతన్యవంతంగా వ్యవహరిస్తూ ఓటు అనే ఆయుధంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సారథ్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసి అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం నిరంతరం సిపిఐ(ఎం) ఉద్యమించిందని తెలిపారు. దళితవాడలు, గిరిజన తండాలు బాగుపడాలని వారంతా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డిమాండ్‌ చేస్తూ తమ్మినేని వీరభద్రం సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని సాధించిందన్నారు. ప్రజా సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి, జిల్లా రూపురేఖలను మార్చగలిగే దమ్ము, ధైర్యం ఉన్న, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, పోరాట పటిమ, నిబద్ధత కలిగిన సిపిఐ(ఎం) నాయకులను చట్టసభలకు పంపడం ద్వారానే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనునిత్యం పేదల వెన్నంటే ఉంటూ వాటి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ప్రజా గొంతుకలు సిపిఐ(ఎం) నాయకుల ద్వారా చట్టసభలలో ప్రజావాణి వినిపించేందుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కెవి.రామిరెడ్డి, నాయకులు రచ్చ నరసింహారావు, ఏటుకూరి రామారావు, పగటికత్తుల నాగేశ్వరరావు, రాసాల కనకయ్య, దుగ్గి వెంకటేశ్వర్లు, బెల్లం లక్ష్మి, సిరికొండ ఉమామహేశ్వరి, కట్టెకోల వెంకన్న, మారుతి కొండలరావు, భూక్య కృష్ణ, బండి రామమూర్తి, డేగల వెంకటేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ, ఇంటూరి అశోక్‌, ఎడ్ల తిరుపతిరావు, ఎరదేశి నరసింహారావు, శీలం అప్పారావు, పెద్దిరాజు నరసయ్య, రాసాల నవీన్‌, శివరాజు తదితరులు పాల్గొన్నారు.