సివిల్స్‌తో ప్రజా సేవకు అవకాశం

– పేదరికం ప్రతిభకు అడ్డు కాదు : బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఐఏఎస్‌ బుర్రా వెంకటేశం
నవతెలంగాణ- ఓయూ
ప్రజా సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించి.. వారికి సేవ చేస్తూ గౌరవాన్ని పొందే అవకాశం కేవలం సివిల్‌ సర్వీస్‌లోనే లభిస్తుందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్‌ బుర్రా వెంకటేశం అన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం సివిల్స్‌ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్టడీ సర్కిల్‌ రూపొందించిన కెరియర్‌ గైడెన్స్‌ కరపత్రాన్ని బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సివిల్స్‌ టాపర్‌లో గురుకుల విద్యాసంస్థల్లో చదివిన వారు ఉండటం అభినందనీయమన్నారు. గురుకుల విద్య అత్యున్నతమైన క్రమశిక్షణ ఇస్తుందనడానికి సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన వారే నిదర్శనమని చెప్పారు. బీసీ గురుకులంలో ప్రాథమిక విద్య, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి.. ఎన్నో అవరోధాలను అధిగమించి తాను సివిల్స్‌ సాధించానని చెప్పారు. ఈరోజు యువత పేదరికాన్ని సవాల్‌ చేస్తూ సివిల్స్‌ టాపర్‌గా నిలవడం వారి నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ప్రతిభ ఉన్న వారికి సివిల్స్‌, గ్రూప్స్‌ కోచింగ్‌ సంక్షేమ శాఖ అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓయూలో స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఓయూ సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ డైరెక్టర్‌ ప్రొ.చింత గణేషం మాట్లాడుతూ.. సివిల్‌ సాధించాలని ఆసక్తి ఉన్నవాళ్లకి ఓయూ అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఏటా సివిల్స్‌ విజేతలతో ముఖాముఖి నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఓయూ యూజీసీ అఫైర్స్‌ డీన్‌ ప్రొ. జి.మల్లేశం మాట్లాడుతూ.. తాను ఎంతో పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగానని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అన్నారు. కష్టపడితే అవకాశాలు వస్తాయని చెప్పారు. సివిల్స్‌లో ఆలిండియా మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి, 35 ర్యాంకర్‌ సాంకేత్‌ కుమార్‌, 60 ర్యాంకర్‌ సాయి ప్రణవ్‌, 94వ ర్యాంకర్‌ సాయికృష్ణ, 200 ర్యాంకర్‌ మహేష్‌ కుమార్‌, 410 ర్యాంకర్‌ రేవయ్య, 510 ర్యాంకర్‌ ప్రణీత్‌, 548 ర్యాంకర్‌ హిమ వంశీ, 646 ర్యాంకర్‌ అపూర్వ తదితరులు పాల్గొని తాము సివిల్స్‌ సాధించడంలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు.
అనంతరం విశ్వసాహితీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ”అమ్మానాన్న అనురాగం” డాన్స్‌ కాంపిటీషన్‌లో విజేతలకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ. లక్ష్మీనారాయణ, ప్రొ.చల్లమల్ల వెంకటేశ్వర రావు, ప్రొ. మంగు, సైకాలజిస్ట్‌ వీరేందర్‌, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌, అలోక్‌ కుమార్‌, తిరుపతయ్య, జిల్లా స్టడీ సర్కిల్‌ డైరెక్టర్స్‌, ఓయూ విద్యార్థులు, ఎంజెపి, విద్యార్థులు పాల్గొన్నారు.