నేడు పాట్నాలో ప్రతిపక్షాల భేటీ

– హాజరుకానున్న 20 పార్టీల అధినేతలు
– బీఆర్‌ఎస్‌,టీడీపీ,వైసీపీ,బీజేడీ,బీఎస్పీ,జేడీఎస్‌ దూరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కార్‌ ను గద్దెదించేందుకు ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. నేడు (శుక్రవారం) బీహార్‌లోని పాట్నాలో బీజేపీయేతర పార్టీల మధ్య చారిత్రక సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో 20 పార్టీల నుంచి ఆయా పార్టీల అధినేతలు పాల్గొననున్నారు. హాజరయ్యే నాయకులకు స్వాగతం పలుకుతూ బీహార్‌ అధికార కూటమిలోని సభ్యులు పాట్నా వీధుల్లో భారీ ఆర్చ్‌లు, బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సమావేశం ఒక భాగం. ఈ సమావేశానికి కాంగ్రెస్‌, డీఎంకే, జేడీయూ, ఆర్‌జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్‌సీపీ, టీఎంసీ, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), జేఎంఎం, ఆప్‌, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ(ఎంఎంల్‌), నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, పీడీపీ, కేరళ కాంగ్రెస్‌, ఐయుఎంఎల్‌ తదితర పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌదరి తాను విదేశీ పర్యటనలో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేనని, తమ మద్దతు ఉంటుందని బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ, తెలంగాణ లోని అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ పార్టీలు తొలి నుంచి బీజేపీతో అంటకాగుతున్నాయి. పార్లమెంట్‌లో అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీకి మద్దతు తెలిపాయి. మరోవైపు బీజేపీపై పోరాడుతున్నట్టు చెబుతున్న బీఆర్‌ఎస్‌ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉంది. అలాగే బీజేడీ, బీఎస్‌పీ, జేడీఎస్‌ తదితర పార్టీలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.