ఉత్తర్వులిచ్చి…ఊరుకున్నారు

– జీఓల గెజిట్‌కు రాజకీయ గ్రహణం
–  పదేండ్లుగా సవరించని వైనం
– మొరపెట్టున్నా పట్టించుకోని సర్కార్‌
– 75షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో 1.20కోట్ల మంది కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ఆర్థికాభివద్ధికి పారిశ్రామికీకరణ ప్రధాన వ్యూహమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో కూడా ఉపాధి అవకాశాలను సష్టించడం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. ‘పరిశోధన నుంచి ఆవిష్కరణ, ఆవిష్కరణ నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి శ్రేయస్సు’ అనే లక్ష్యాలతో తెలంగాణలో-ఇన్నోవేట్‌, ఇంక్యుబేట్‌, ఇన్‌కార్పొరేట్‌ అనే నినాదంతో కొత్త ‘పారిశ్రామిక విధానం-2015’ను రూపొందించింది. ఈ విధానంతో పారిశ్రామిక అనుమతులు సులభతరమై పరిశ్రమల స్థాపనలో ఉన్న అనవసరమైన అడ్డంకులు తొలిగి రాష్ట్రంలోకి పరిశ్రమలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పరిశ్రమలు పెట్టడానికి ఏ తరహాలో అనుమతులిస్తున్నామో..అదే తరహాలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పలుమార్లు ప్రకటించారు. కాని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో కనీసవేతనాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది.
75షెడ్యూల్డ్‌ పరిశ్రమలు
తెలంగాణ రాష్ట్రంలో 75షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌ యూనిట్స్‌ ఉన్నాయి. మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్స్‌, డిస్టిలరీస్‌, బ్రేవరీస్‌, కెమికల్స్‌, ఫార్మాసూటికల్స్‌, మెటల్‌ఫౌండరీస్‌, జనరల్‌ ఇంజినీరింగ్‌, కాంట్రాక్టు లేబర్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇండిస్టీ, సెక్యూరిటీ సర్వీసెస్‌, సాఫ్ట్‌డ్రింక్స్‌, ఎరెటెడ్‌ వాటర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, స్పినింగ్‌మిల్స్‌, స్టీల్‌మిల్స్‌, స్టీల్‌రోలింగ్‌మిల్స్‌122, పెట్రోల్‌బంకులు, రైస్‌/దాల్‌/రోలర్‌ఫ్లోర్‌ మిల్లులు, హాస్పిటల్స్‌, నర్సింగ్‌హౌమ్స్‌, గార్మెంట్స్‌, నిర్మాణ రంగం, రోడ్లు, భవనాల నిర్వహణ, అయిల్‌మిల్స్‌, షాప్స్‌, కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, పౌల్ట్రీ, బేకింగ్‌ ప్రాసెస్‌, బిస్కెట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో 1.20కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో స్కిల్డ్‌, సెమిస్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ వర్కర్లు ఉన్నారు. ఈ రంగాల్లో రోజుకు 8గంటలు పనిచేస్తే నెలబేసిక్‌+వీడీఏను కలిపి కనీస వేతనం ఇవ్వాలి. 12గంటలు పనిచేస్తే ఓవర్‌టైం డబుల్‌ వేతనం ఇవ్వాలి. వార్షిక బోనస్‌ కూడా ఇవ్వాలి. కానీ వీటిలో ఏఒక్కటీ అమలు చేయడంలేదు.
గెజిట్‌కు రాజకీయ గ్రహణం
కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం పెరిగిన ధరలకు అగుణంగా ప్రతి ఐదేండ్లకొకసారి సవరించి పెంచాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి లెక్కిస్తే మూడు సార్లు సవరించాలి. తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల కాలంలో రెండు సార్లు సవరించాల్సి ఉంది. కానీ ఆ ఊసేలేదు. పైగా కార్మికుల సంక్షేమం గురించి ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనాల జీఓలను అటకెక్కించింది. 2021 జూన్‌లో ఐదు రంగాలకు కనీసం వేతనం రూ.18వేలుగా నిర్ణయించి ఉన్నతాధికారులు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి గెజిట్‌ చేయకుండా స్వయాన ముఖ్యమంత్రి కార్యాలయమే అడ్డుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు కనీసవేతన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మండలి సిపార్సులను అమలు చేయకుండా తొక్కిపెట్టింది.
కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలి
షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలి. కనీసవేతనం రూ.26వేలుగా నిర్ణయించి అమలు చేయాలి. పెరుగుతున్న శాస్త్రసాంకేతికత దృష్ట్యా రోజుకు 7గంటలు, వారానికి ఐదురోజులు పనిదినంగా ఉండాలి. కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, సెలవులు, బోనస్‌, గ్రాట్యుటీ అమలు చేయాలి.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌.
వలస కార్మికుల దుస్థితి
రాష్ట్రంలో 80శాతం మంది వలసకార్మికులు ఉన్నారు. బీహార్‌, ఒరిస్సా, బెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారనేకులు తెలంగాణలో పనిచేస్తున్నారు. మహిళా కార్మికుల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ వలసకార్మికులకు హక్కుల్లేవు. చట్టాలు అమలుకావు. రోజుకు 12గంటలకుపైగానే పనులు చేయిస్తున్నారు. కనీసవేతనాల్లేవు. ఓవర్‌టైం వేతనం చెల్లిండంలేదు. వలసకార్మికులే లేకపోతే రాష్ట్రంలో నిర్మాణరంగం ఒక్కసారిగా పడిపోతుందని అధికారులే చెబుతున్నా కరోనా సమయంలో వీరి బాధతలు వర్ణణాతీతం. వీరు నిర్మాణ రంగంతోపాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో అధికంగా పనిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పనులు దొరక్క ఇక్కడికి వలసవస్తున్నారు.