అర్డినెన్స్‌ అప్రజాస్వామికం

– సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం
– వెబినార్‌లో కర్నాటక హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నాగమోహన్‌దాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం తీసుకొచ్చిన అర్డినెన్స్‌ అప్రజాస్వామికమని కర్నాటక హైకోర్టు రిటైర్డ్‌ జడ్డి నాగమోహన్‌దాస్‌ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అధ్యక్షతన ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం అర్డినెన్స్‌ -పర్యావసానం’ అంశంపై శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో నాగమోహన్‌దాస్‌ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలను కేటాయించారని తెలిపారు. పోలీసు వ్యవస్థ, ల్యాండ్‌ రెవెన్యూపై పూర్తిగా కేంద్రానికి అధికారాలు ఉన్నాయని అన్నారు. మిగిలిన పరిపాలన పరమైన అంశాల్లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లెప్టినెంట్‌ గవర్నర్‌కు అధికారాలను కట్టబెడుతూ అర్డినెన్స్‌ తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని, సమాఖ్య వ్యవస్థ స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఉద్యోగుల నియామకం, బదిలీలు, ప్రమోషన్స్‌, డీమోషన్స్‌, సస్పెండ్‌ ఇతర అన్ని విషయాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా లెప్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలు ఇవ్వడం దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వానికి జరిగిందని, రేపు మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశమూలేక పోలేదని వివరించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న మెజార్టీ ప్రభుత్వాలను కూల్చేసి మైనార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, రాజకీయంగా, అభివృద్ధిపరంగా ఇబ్బందులకు గురిచేస్తూ అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అగౌరపరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగ విలువలను ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అర్డినెన్స్‌ ఆరునెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, దీన్ని పార్లమెంట్‌ బిల్లు పెట్టేందుకు లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉందని, రాజ్యసభలో మాత్రంలో మెజార్టీ లేదని, దీన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ చొరవతీసుకుని తిప్పికొట్టాలని సూచించారు. కేశవనంద భారతి కేసులో రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ముట్టుకోరాదని, ఎలాంటి సవరణలు చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని అన్నారు.