ఓయూ మాజీ వీసీ కన్నుమూత

– జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఖ్యాతిని పతాకస్థాయికి చేర్చిన మాజీ వీసీ ప్రొఫెసర్‌ టి.నవనీతరావు(95) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ తన నివాసంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో చిన్న కుమారుడు పూర్తి చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొ.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొ. రవిందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ. పి. లక్ష్మినారాయణ, స్టాన్లీ విద్యాసంస్థల అధినేత కృష్ణారావు, విద్యా సంస్థల చైర్మెన్‌లు, పలువురు మాజీ వీసీలు, రిజిస్ట్రార్‌లు, విద్యావేత్తలు, అధ్యాపకులు, ఉద్యోగులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్‌లోని ఆయన నివాసంలో మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఓయూకు ప్రొపెసర్‌ నవనీతరావు అందించిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 1988, ఆ తర్వాత విద్యాసంవత్సరాన్ని కాపాడారని గుర్తు చేసుకున్నారు. నవనీతరావు ఓయూ వీసీగా రెండు సార్లు పనిచేశారు. అంతకుముందు ఓయూలో డైరెక్టర్‌గా, పీజీ సెంటర్స్‌ డెరైక్టర్‌గా పని చేశారు. ఓయూ ల్యాండ్స్‌ సంరక్షణ కోసం ప్రహరీ ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణలో అనేక ఉత్తమ సంస్కరణలు తీసుకొచ్చారు. ఓయూలో బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేసి పలువురు ఓయూ విద్యార్థులకు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు అవకాశాలు కల్పించారు. అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని పలువురు అభిప్రాయపడ్డారు.