మన ‘వరాలు’

ఎప్పుడు నేర్చినావ్‌ తల్లి
ఈ చిరునవ్వుని
కొమ్మల మీది లేత ఎర్రని చివుర్లు తుళ్ళి పడ్డట్టు
నవ్వు మరిచిన లోకం సిగ్గుతో తల దించుకునేట్టు
మానవత్వ తత్వం బోధిస్తూ
నవ్వు తల్లి నవ్వు

అప్పుడే జ్ఞాపకాల తుట్టెను కదల్చినట్టు
అవేవో గుర్తుకు వచ్చినట్టు
నవ్వులో నేర్పరితనం పూయిస్తున్నావ్‌
నీ మందహాసం చూసి
విచ్చుకుంటున్న మొగ్గలు సిగ్గిల్లుతున్నారు

ఈ కాఠిన్యపు లోకం
ముందు ముందు నవ్వనిస్తుందో లేదో
నీ తల్లి కడుపంత సురిక్షితం లభిస్తుందా నీకు
బయట అంతా భీభత్స సంక్షోభం తల్లి
తల్లి కడుపు సుకుమారం విడిచి
వచ్చేశావు కదూ
స్వాగతం, సుస్వాగతంరా నీకు

కుటుంబ శరీరాన్ని కరిగించి
నువ్వు కాలు మోపినంత మేర
తివాచీగా పరుస్తాను

శేష జీవిత మంతా
ఎన్నో ఉత్ప్రేరకాలున్నా
నీ సుకుమార నవ్వు నీడలో
తరిస్తాను.

నేర్రెలిడిన నేల
నీ నవ్వు సోకి
తప్పక పుష్పిస్తుంది.
(4,5 గంటల ముందు పుట్టిన పసిపాప నా మనమరాలు నవ్వుతున్న దృశ్యం చూసిన సందర్భంగా)
– హనీఫ్‌, 9247580946