కర్నె శిరీష… నిండా పాతికేండ్లు కూడా లేని నిరుపేద అమ్మాయి. అయినా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. రెండేండ్ల కిందట సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ చిన్న వీడియో రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను ముప్పై సెకండ్ల ఆ వీడియోలో ఎత్తి చూపింది. అప్పటి నుండి బర్రెలక్కగా అందరికి పరిచయమయింది. ఇప్పుడు కొల్హాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
‘ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తూ హైదరాబాద్‌లో ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు వరకు పని చేసినా ఇచ్చే జీతం తక్కువ. నాకు చిన్నప్పటి నుండి ప్రశ్నించే తత్వం ఎక్కువ. పని గంటల గురించి బాగా అడిగేదాన్ని. దాంతో ఉద్యోగం నుండి తీసేశారు. దాంతో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించా. గ్రూప్ పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయి. దాంతో ఊరికి వచ్చేసి అమ్మకు తోడుగా ఏదో ఒక పని చేయాలనుకున్నా. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే బర్రెలు కొనుక్కుందామని నాలుగు బర్రెలు కొన్నా. అప్పటికే సరదాగా చిన్న చిన్న కామెడీ రీల్స్ చేసి పోస్ట్ చేస్తుండేదాన్ని. బర్రెలు కొన్న తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు అందరికీ తెలియాలని ఓ వీడియో చేసి పెట్టా. అంతే నాపై కేసు పెట్టారు. నిజాలు చెప్తే ఇలా చేస్తారా? అనే ఆలోచన అప్పుడే వచ్చింది. అలాగే మా నాన్న రెండేండ్ల కిందట మమ్మల్ని వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఆయన బాగా తాగుతాడు. మాకు పది కుంటల పొలం వుండేది. ధరణి వచ్చిన తర్వాత ఎవరి పేరున ఉన్న పొలం వాళ్ళకు అమ్ముకునే హక్కు వచ్చిందంట. దాంతో మా నాన్న మాకెవ్వరికీ తెలియకుండా ఆ కాస్త పొలం అమ్ముకొని పొయ్యాడు. ఆ పొలం కోసం ఎంతో మందిని కలిశాను. ఎమ్మార్వోలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగాను. కేసుపై కోర్టుకు వెళితే నన్ను ఎగతాళి చేసేవారు. ఇవన్నీ నా మనసులో అలాగే ఉండిపోయాయి. అందుకే యువత సమస్యలు అసెంబ్లీలో వినిపిం చాలని ఎమ్మెల్యేగా పోటీ చేద్దామ నుకున్నా’ అంటుంది శిరీష.
యువత మొత్తం అమ్మ పిల్లలే
‘ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అమ్మకు చెబితే ముందు నవ్వింది. నీకెందుకే ఇవన్నీ అని తిట్టింది. నేను చేస్తానని గట్టిగా చెప్పే సరికి మన దగ్గర చిల్లి గవ్వ లేదు. ఎమ్మెల్యే అంటే పది నుండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు వద్దు’ అని కోప్పడింది. నేను మాత్రం తర్వాత రోజు కాలేజీలో పనుందని చెప్పి వచ్చి నామినేషన్ వేశాను. ఆ విషయం తెలుసుకుని మా అమ్మ బాగా తిట్టింది. కానీ తర్వాత నాకు వస్తున మద్దతు, మా ఇంటికి వచ్చి అనేక మంది సపోర్ట్ చేయడం చూసి అమ్మ కూడా సంతోషించింది. ప్రచారంలో ఉన్న మా తమ్ముడిపై దాడి చేసినప్పుడు అమ్మ భయపడింది. కానీ మాకు అందరూ మద్దతుగా నిలబడడంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు మా అమ్మకు మేము మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం పిల్లలే. కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు’ అంటూ ధైర్యంగా చెబుతుంది శిరీష.
తల్లికి భారం కాకూడదని
శిరీష పుట్టింది నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, మరికల్ గ్రామం. తల్లి అనురాధ, శిరీషకు ఓ తమ్ముడు ఉన్నాడు. తండ్రి మద్యానికి బానిసై ఇల్లు పట్టించుకునే వాడు కాదు. తల్లి చిన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టుకొని ఇద్దరు పిల్లలను పెంచుకుంటుంది. ఇప్పుడు అదే శిరీష ప్రచార కేంద్రం. ఊళ్లోని స్కూల్లోనే ఏడోతరగతి వరకు పూర్తి చేసింది. తర్వాత కస్తూర్బా హాస్టల్లో పదో తరగతి వరకు చదివింది. డిప్లొమా కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందని విని అగ్రికల్చర్ డిప్లొమా చేసింది. కానీ రాలేదు. దాంతో ఇంటర్ చదివింది. అయినా ఉద్యోగం రాలేదు. ఇక తన చదువు తల్లికి భారం కాకూడదని ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసేది. ఇక్కడ ఉన్నప్పుడు నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను ఆమె కండ్లారా చూసింది.
నిరుద్యోగుల గొంతుకను
‘హైదరాబాద్‌లో ఉద్యోగం మానేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుదామనకున్నా. అయితే ఏడేనిమిది మంది ఒకే రూములో ఉంటూ గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండేవారు. తినడానికి తిండి లేక గుడి దగ్గర పెట్టే అన్నదానం దగ్గరకు వెళ్లడం చూశాను. మాలాంటి వారంతా ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే కష్టపడి చదువుకుంటారు. కానీ ప్రభుత్వాలు నోటిఫికేషన్లు వేయకుండా మమ్మల్ని మోసం చేస్తున్నాయి. చాలా బాధగా అనిపింది. అందుకే నేను నిరుద్యోగుల గొంతుక కావాలనుకున్నాను. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి యువతకు న్యాయం చేద్దామనుకుంటున్నాను. అమ్మమ్మలకు, నాయనమ్మలకు పెన్షన్ ఇస్తే సమస్య పరిష్కారం కాదు, మనవళ్ళకు, మనవరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది’ అంటుంది శిరీష.
ఏం చేస్తుందిలే అనుకున్నారు
నవంబర్ 8న నామినేషన్ వేసినపుడు శిరీష వెనక ఒక్కరు కూడా లేరు. కానీ ఇప్పుడు ఆమె వెంట వేల మంది ఉన్నారు. యువత విజిల్ గుర్తుకే మా ఓటు అంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై గట్టిగా మాట్లాడుతున్న శిరీషకు పూర్తి మద్దతు లభిస్తుంది. స్వతంత్ర అభ్యర్థి, నిరుపేద కుటుంబం నుండి వచ్చింది అందులోనూ ఆడపిల్ల. ఏం చేస్తుందిలే అనుకున్నారు పెద్ద పార్టీల వారు. కానీ ఇప్పుడు నియోజక వర్గంలో ప్రతి గ్రామం నుండి ఆమెకు మంచి ఆధరణ లభిస్తుంది. బర్రెలక్క గెలుపు ఖాయం అనే నినాదం బలంగా వినబడుతోంది. దాంతో ఇప్పుడు పెద్ద పార్టీల వారికి చెమటలు పడుతున్నాయి.
ఇదే నా విజయం…
‘ఇప్పటి వరకు పరిపాలించిన వారంతా ఒక్కొక్కరు 20 ఏండ్లు పదవుల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా జీతాలు తీసుకుంటున్నారు, కానీ మా ప్రాంతం మాత్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఇన్నేండ్లు ఏమీ చేయని పాలకులు ఇప్పుడు మాత్రం మాలాంటి వాళ్ళకు ఏదో చేస్తారనే నమ్మకం లేదు. అందుకే నేను ధైర్యంగా నామినేషన్ వేశాను. అందురూ డబ్బు మనుషులే ఉండరు. కాబట్టే చాలా మంది నాకు మద్దతు ఇస్తున్నారు. ప్రచారం చేసుకోవడానికి కార్లు ఇస్తున్నారు. డబ్బు సాయం చేస్తున్నారు. ప్రచారానికి అవసరమైన సామాగ్రి మొత్తం ప్రజలే అందిస్తున్నారు. ఇదే నాకు గొప్ప విజయంగా అనిపిస్తుంది’ అంటూ తన గెలుపుపై శిరీష ఎంతో నమ్మకంగా ఉంది.
శిరీషకు ధైర్యం ఎక్కువ
నామినేషన్ వేస్తా అంటే నవ్వి, కోప్పడ్డాను. ఏడ్చి ఊరుకుంది. తర్వాత నామినేషన్ వేస్తున్నట్టు కూడా నాకు తెలీదు. కొల్హాపూర్‌లో ఆమెపై కేసు ఉంది ఆ కేసు చూస్తున్న లాయర్ దగ్గర ‘అన్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్నా, అమ్మకు చెప్తే తిట్టింది. నేను ఎలాగైనా నామినేషన్ ఏస్తా’ అన్నదంటా. ఆ లాయర్ బాబే శిరీషకు కావల్సిన పేపర్లన్నీ తయారు చేసి ఇచ్చాడంట. దానికి ఐదు వందలు ఖర్చు అయితే ఆ డబ్బు కూడా అతనే ఇచ్చాడు. నామినేషన్ వేసిన తర్వాత ఆమె ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు ఒకటే భయం. చెప్తే వినదు అని కంగారు పడ్డాను. పైసలు పంచితే తప్ప గెలిచే పరిస్థితి లేదు. మాకేమో వచ్చిన వాళ్ళకు మంచి నీళ్ళు ఇచ్చే శక్తి కూడా లేదు. ఇదంతా అవసరమా అని తిట్టినా. తర్వాత రోజు వెనక్కు తీసుకుంటదిలే అనుకున్నా. కానీ వాళ్ళ సార్‌తో నాతో చెప్పించింది. శిరీష మంచి పని చేస్తుంది. పోటీ చేయనియ్యమని నాకు నచ్చజెప్పారు. తర్వాత చాలా మంది ఇంటికి రావడం చూశాక ధైర్యం వచ్చింది. అయితే కొంత మంది ఇంటికి వచ్చి మీ అమ్మాయిపై ఉన్న కేసు ఎత్తేస్తాం, ఆర్ధిక సాయం చేస్తాం’ వెనక్కు తీసుకోమని చెప్పు అన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. శిరీషకు ధైర్యం ఎక్కువ. తప్పు జరిగితే అస్సలు భరించలేదు. తనని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది.
– అనూరాధ, శిరీష తల్లి
మా అమ్మమ్మలకు పెన్షన్ కాదు మాకు ఉద్యోగం కావాలి
10:23 pm