మేకను ఎత్తుకెళ్లారనే కారణంతో దౌర్జన్యం

– అమానుషంగా ప్రవర్తించిన దుండగులు
– వారిని కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మేకను ఎత్తుకేళ్లారనే కారణంతో అమానుషంగా దౌర్జన్యానికి పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం యాపల్‌ ప్రాంతంలో చాకలి రాములు అనే యాజమానికి మేకల కాపరిగా ఉన్న తేజతో పాటు అతడి స్నేహితుడు చిలుముల కిరణ్‌ అనే దళిత యువకుడిని మేకలు ఎత్తుకెళ్లారనే కారణంతో చెట్టుకు కట్టేసి తలకిందులుగా వేలాడదీసిఅమానుషంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు జరిగితే పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయాలి కానీ.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మధ్యయుగాల నాటి అమానుషాలకు పాల్పడటమేంటని ప్రశ్నించారు. ఒక దళితుడు నా మేకను దొంగలిస్తాడా? అనే కుల దురహంకారంతో బాధితులను తలకిందులుగా చెట్టుకి వేలాడదీసి, కింద అగ్గి మంట పెట్టి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. అవమానం భరించలేక కిరణ్‌ ఎవరికి చెప్పకుండా పారిపోయాడని తెలిపారు. తక్షణమే మేకల యజమాని చాకలి రాములు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.