నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శనివారం నుంచి ఈనెల 14 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పీడీఎస్‌యూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్ మార్క్స్‌భవన్‌లో ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జాతీయ నాయకులు ఎస్ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన విద్యారంగాన్ని వ్యాపార స్థాయికి పాలకులు దిగజార్చారని విమర్శించారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, కామన్ స్కూల్ విధానం అమలు చేస్తామనీ సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని గుర్తు చేశారు. ఈ తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల్లేవనీ, పర్యవేక్షణ అధికారుల్లేరని చెప్పారు. 24 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో పోరాటాల రూపకల్పన కోసం ఈ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి, అనిల్, నాయకులు సుమంత్, కోటి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.