మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలి

– జంతర్‌ మంతర్‌ వద్ద 40 సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ : మణిపూర్‌ వివాదాన్ని నియంత్రించి శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మహిళా సంఘాలతో సహా నలభై సంస్థలు పిలుపునిచ్చిన ఆందోళనలో అల్లర్ల బాధితులతో సహా వందలాది మంది పాల్గొన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాల హౌరెత్తించారు. ముఖ్యమంత్రిని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అల్లర్ల బాధితులు ఎదుర్కొన్న క్రూరమైన అనుభవాలను కూడా వివరించారు. ఐద్వా అధ్యక్షురాలు పికె శ్రీమతి టీచర్‌ ఆందోళనను ఉద్దేశించి మాట్లాడారు. మణిపూర్‌ పోరాటానికి చివరి వరకు ఐద్వా అగ్రభాగాన నిలుస్తుందనీ, శాంతిభద్రతల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపురిలు భారతదేశంలో భాగమనీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు హింసకు గురవుతున్నారని శ్రీమతి టీచర్‌ అన్నారు. ఐద్వా నాయకురాలు సుభాషిణి అలీ, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ లీడర్‌ అన్నీ రాజా, మహిళా హక్కుల కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మరోవైపు మణిపూర్‌లోని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ స్మారక మందిరం రాజ్‌ఘాట్‌ వద్ద శాంతి పునరుద్ధరణ పిలుపుతో సత్యాగ్రహం జరిగింది. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్‌ ఇలా పది పార్టీలు పాల్గొన్నాయి.