పెండింగ్‌లో ఎంపీలపై క్రిమినల్‌ కేసులు

– 44 శాతం లోక్‌సభ ఎంపీల కేసులు పెండింగ్‌
– 31 శాతం రాజ్యసభ ఎంపీల కేసులు పెండింగ్‌
– సుప్రీం కోర్టుకు తెలిపిన అమికస్‌ క్యూరీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ సభ్యులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ ఉందని అత్యున్నత న్యాయస్థానానికి అమికస్‌ క్యూరీ విజరు హన్సారియా తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ సీనియర్‌ న్యాయవాది విజరు హన్సారియా సుప్రీంకోర్టుకు తన 17 నివేదిక సమర్పించారు. 2022 జులై నాటికి 44 శాతం లోక్‌సభ ఎంపీలు, 31 శాతం రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ చేసిన అధ్యయనం ఆధారంగా తన నివేదికలో పేర్కొన్నారు.
2016లో ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని న్యాయవాది అశ్విని కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై 5,097 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 40 శాతం కంటే ఎక్కువ (2,122) కేసులు ఐదేండ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ నివేదిక ప్రకారం 2022 జులై నాటికి 542 మంది లోక్‌సభ ఎంపీల్లో 236 మంది (44 శాతం), 226 మంది రాజ్యసభ సభ్యుల్లో 71 మంది (31 శాతం), 3,991 మంది ఎమ్మెల్యేల్లో 1,723 మంది (43 శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తమ నివేదికలో అమికస్‌ క్యూరీ తెలిపారు. సాక్షుల విచారణ, నిందితుల హాజరు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను త్వరితగతిన విచారించాలని అమికస్‌ క్యూరీ కోరారు. విచారణ ఆలస్యం అయితే, సంబంధిత సభ్యుల బెయిల్‌ రద్దు చేయాలని కూడా సూచించింది. విచారణకు సహకరించకపోతే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపాలని తెలిపారు. మాజీ సభ్యుల కంటే, సిట్టింగ్‌ సభ్యులకు సంబంధించిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలిన కూడా సూచించారు.