పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Pending issues should be resolved– పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఎదుట మోడల్‌ స్కూల్స్‌, హాస్టల్స్‌ నాన్‌టీచింగ్‌ సిబ్బంది ధర్నా
– కమిషనర్‌ దేవసేనకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమను పర్మినెంట్‌ చేసి జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలివ్వాలనీ, పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ హాస్టల్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నాన్‌టీచింగ్‌ సిబ్బంది ధర్నా చేశారు. ‘జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలివ్వాలి…పర్మినెంట్‌ చేయాలి…పదేండ్ల నుంచి చేస్తున్నా పట్టదా? 8 గంటల పనివిధానం అమలు చేయాలి’ అని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్‌ దేవసేనకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ స్పందిస్తూ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, యూనియన్‌ నాయకులు ఎడ్ల రమేష్‌, కిరణ్‌, రేణుక, సుజాత, సంతోష, గీత పాల్గొన్నారు. అంతకుముందు ధర్నానుద్దేశించి వెంకటేశ్‌ మాట్లా డారు. మోడల్‌ స్కూల్స్‌, హాస్టళ్ళల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎమ్‌లు, వంట మనుషులు, వాచ్‌మెన్లు, ఇతర నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఆరేడు వేల రూపాయ లను మాత్రమే పొందుతున్నారని చెప్పారు. అంత తక్కువ వేతనంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వారిని పర్మినెంట్‌ చేసి జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల వల్లే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. హాస్టల్స్‌ కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ ఇన్‌ఛార్జిని రద్దు చేసి కేర్‌ టేకర్‌ పూర్తి బాధ్యత వహించాలనీ, కెజిబివి స్పెషల్‌ ఆఫీసర్‌ వేతనం ఇవ్వాలని విన్నవించారు. 24 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల డ్యూటీ చార్ట్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్కూల్స్‌, హాస్టల్స్‌ లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న పది నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ఫర్నీచర్‌, ఫోన్‌, తదితర సౌకర్యా లను కల్పించాలని కోరారు. హాస్టల్‌ విద్యార్థులకు సరిపడా మందులను ఏఎన్‌ఎమ్‌ లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్కావెంజర్లకూ కనీస వేతనాలివ్వాలన్నారు.