– సీపీఐ(ఎం) జోన్ కన్వీనర్లు గుడవర్తి
నాగేశ్వరరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు పిలుపు
నవతెలంగాణ-నేలకొండపల్లి
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం అధ్యయనం చేస్తూ పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) అనాసాగరం, కోరట్లగూడెం జోన్ కన్వీనర్లు గొడవర్తి నాగేశ్వరరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అనాసాగరం, కోరట్లగూడెం గ్రామాలలో పార్టీ జోన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విప్లమయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేటికీ లక్ష రూపాయల రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతు రుణాలు మాఫీ కాక, మరోవైపు నూతన రుణాలకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ బ్యాంకర్లు షరతులు విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అరకొరగా కురుస్తున్న వర్షాలతో చెరకు, వరి, మిరప ఇతర వాణిజ్య పంటలు నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలను నిరంతరాయంగా అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. పంటలకు అవసరమైన యూరియా, డిఏపి వంటి ఎరువులను డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అటువంటి దుకాణాలపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో దళితబంధు బీసీబందు వంటి పథకాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అధికార పార్టీ నాయకుల జోక్యంతో నిరుపేదలైన, అర్హత కలిగిన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు ఎంపికలో ఎటువంటి అవకతవకులకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు సిరికొండ ఉమామహేశ్వరి, డేగల వెంకటేశ్వరరావు, బండి రామమూర్తి, మారుతి కొండలరావు, ఎడ్ల తిరుపతిరావు, పొన్నం శివరాజు, శాఖా కార్యదర్శులు గురజాల వెంకటేశ్వర్లు, మీగడ లింగరాజు, దండ సూర్యనారాయణ, మారుతి సూర్యనారాయణ, బొడ్డు మధు, సిరికొండ నాగేశ్వరరావు, కిరణ్, కూరపాటి ప్రసాద్, మందడపు రవీంద్రబాబు, గాదె వెంకటేశ్వర్లు, పాపినేని బాబు, బోయినపల్లి వీరయ్య, డేగల హరి ప్రసాద్, మంకెనపల్లి క్రాంతి కిరణ్, సిరికొండ వెంకట్ రావమ్మ తదితరులు పాల్గొన్నారు.