ఎనిమిది జిల్లాల్లో పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు

–  పౌరసరఫరాల సంస్థ చ్కెర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రెండో దశలో ఎనిమిది జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయనున్నట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మెన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాల్లో పెట్రోల్‌ బంకులకు అనువైన స్థలాలను గుర్తించి ఆయా ఆయిల్‌ కంపెనీలకు టాయింపు జరిపేందుకు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌ మెంట్‌ జనరల్‌ మేనేజర్లు, ఫైనాన్స్‌ డీజీఎం, హైదరాబాద్‌ జిల్లా మేనేజర్‌ ఉంటారని వివరించారు. తొలి విడతలో ఇదివరకే కరీంనగర్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి (ఐఓసి), కొత్తగూడెం, మేడ్చల్‌, ఖమ్మం (హెచ్‌పీసీఎల్‌), జగిత్యాల్‌, మెదక్‌ (బీపీసీఎల్‌)లో బంకులను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. రెండో విడతలో వరంగల్‌, వనపర్తి, సూర్యపేట, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్ధిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. సంస్థ ఆదాయం పెంపునకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు రవీందర్‌ సింగ్‌ తెలిపారు.