రైతు సమస్యలపై దశలవారీగా ఆందోళనలు

 Phased agitations on farmers' issues– ఆగస్టు మొదటివారంలో ఎంపీలకు వినతిపత్రాలు
– వచ్చేనెల 9,10 తేదీల్లో నిరవధిక ధర్నాలు
– నవంబర్‌లో ఉమ్మడి జిల్లాల వారీగా బస్సుయాత్రలు : ఎస్‌కేఎం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీల అమలు కోసం దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఆగస్టు మొదటివారంలో ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిం చాలని కోరింది. వచ్చేనెల 9,10 తేదీల్లో నిరవధిక ధర్నాలు నిర్వహించాలని పేర్కొంది. నవంబర్‌లో ఉమ్మడి జిల్లాల వారీగా బస్సుయాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపింది. ప్రజాసంఘాలతో కలిసి రైతాంగ హక్కుల కోసం ఉద్యమించనున్నట్టు పేర్కొంది. అక్టోబర్‌ 26,27,28 తేదీల్లో ఢిల్లీలో మహాపడావ్‌లో పాల్గొలని పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని మార్క్స్‌భవన్‌లో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్‌, పశ్యపద్మ, వి.ప్రభాకర్‌, మండల వెంకన్న, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, బి. ప్రసాద్‌ తదితరులు విలేకర్లతో మాట్లాడారు.
రైతుల సమస్యలను పరిష్కరించకపోతే, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూనుకుంటామని హెచ్చరించారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లుని ఉపసంహరించాలని కోరారు. ఏకకాలంలో రైతుమాఫీ చేయాలనీ, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అనుకూలంగా ఫసల్‌ బీమా పథకాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలనీ, కౌలు రైతులను గుర్తించి, వారికి రుణార్హత కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రుణభారంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే రుణవిమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ధరణి పోర్టల్‌లోని లోపాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఎస్‌కేఎం సదస్సులో రైతు, వ్యవసాయ, స్వచ్చంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలన్నారన్నారు. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో కమిటీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రైతు ఉద్యమ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు ఎస్‌కేఎం పెద్ద ఎత్తున పోరాడుతుంన్నదని హెచ్చరించారు.