పోలవరం పోరుకేక మహా పాదయాత్ర ప్రారంభం

– జెండా ఊపి ప్రారంభించిన ఏఐకేఎస్‌ జనరల్‌ సెక్రెటరీ విజ్జూ కృష్ణన్‌
– మండుటెండలో, జోరు వానలో సాగిన పాదయాత్ర
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంలో మంగళవారం పోలవరం పోరు కేక మహా పాదయాత్రను ఆల్‌ ఇండియా కేంద్ర కిసాన్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. నిర్వాసితులు పూలమాల వేసి పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
గిరిజన డోలు కొమ్ము రేల నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన సంప్రదాయ రేలా నృత్యాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, తెలంగాణ రాష్ట్ర సీపీఐ(ఎం) నాయకులు పోతినేని సుదర్శన్‌, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు కళాకారులతో కలిసి నృత్యం చేశారు. నెల్లిపాక ప్రధాన కూడలి వద్ద భారీ సంఖ్యలో సీపీఐ(ఎం)కార్యకర్తలు అభిమానులు నిర్వాసితులు పాల్గొని పాదయాత్రను విజయవంతంగా ప్రారంభించారు. పాదయాత్ర కాపవరం, బుట్టాయిగూడెం, సీతాపురం మీదుగా తోటపల్లి చేరుకుంది. తోటపల్లిలో భోజనం చేసిన అనంతరం గన్నవరం గౌరీదేవిపేట, నందిగామ మీదుగా మురుమూరు చేరుకుంది. మురుమూరులో రాత్రి బస చేశారు.
నెల్లిపాకలో ఏర్పాటుచేసిన సభకు కార్యకర్తలు, నిర్వాసితులు ట్రాక్టర్లలోను, ఆటోల్లోనూ, మోటార్‌ బైకులపై వందలాదిగా తరలివచ్చారు. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా, జోరున వర్షంలో తడుచుకుంటూ ఎర్రజెండాలతో పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గిరిజన సంప్రదాయ కొమ్ము డోలు ధరించిన రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, విజ్జూ కృష్ణన్‌, తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పోలవరం పోరుకేక మహా పాదయాత్రకు సంబంధించి పుస్తకావిష్కరణ, ప్రత్యేక పాటల సీడీని ఆవిష్కరించారు. సభ ముగింపులో పాదయాత్ర సారధి వి.శ్రీనివాసరావు వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేయించారు.