ఓటర్‌ జాబితా ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

– కలెక్టర్‌ అనుదీప్‌
నవతెలంగాణ-పాల్వంచ
ఓటర్‌ జాబితాలో అర్హులకు ఓటు హక్కు కల్పించడం అనర్హులకు తొలగించడంలో రాజకీయ పార్టీలు జిల్లా యంత్రంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో 18,438 మంది ఫొటోస్‌ సిమిలర్స్‌ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించామని వారిలో 38 మరణించారని 92 మంది ఇతర ప్రాంతాలకు మారినట్లు విచారణలు తేలినట్లు చెప్పారు. 378 మందిని ఓటు హక్కు పొందడానికి అర్హులుగా గుర్తించి వారిని ఫారం 6 జారీ ద్వారా నూతన ఓటర్లుగా నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 1092 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్న గుర్తించిన 18, 38 ఇండ్లలో 1,61522మంది ఓట్లు ఉన్నారని వారిలో 90,384 మందిని క్షేత్రస్థాయిలో ఉన్నట్లు గుర్తించామని 7025 మందిని ఓటర్లుగా నమోదు చేయుటకు ఫారం 6 జారీ చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కలెక్టరేట్‌ నందు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జూన్‌ 1న కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవిఎం వివి ప్యాట్లు పనితీరును సమీక్షలో పరిశీలిస్తామని చెప్పారు. ఇద్దరు ఏజెంట్లు జాబితాను ఈనెల 27 వరకు అందజేయాలని చెప్పారు. తప్పులు లేని ఓటర్‌ జాబితా రూపకల్పనలో భాగంగా రాజకీయ పార్టీలు బూతు స్థాయి ఏజెంట్లను యాక్టివేట్‌ చేయాలని చెప్పారు. ఏప్రిల్‌ 1 జులై 1 అలాగే అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి ప్రతి ఓటర్‌ ఓటు హక్కు పొందాలని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఎన్‌విఎస్‌ పోర్టల్‌ ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెల్‌ సిబ్బంది నవీన్‌, బిఎస్‌పి నుండి ఆనందరావు, బిజెపి నుండి లక్ష్మణ్‌ అగర్వాల్‌, టిఆర్‌ఎస్‌ నుండి షేక్‌ అన్వర్‌, సిపిఎం నుండి అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుండి మధు తదితరులు పాల్గొన్నారు.