బ్రోకర్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు

– ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కొంతమంది బ్రోకర్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తాను ఒక యూట్యూబర్‌ను కిడ్నాప్‌ చేసి, కొట్టినట్టు కథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కిడ్నాప్‌ చేశానని నిరూపిస్తే… కమలాపూర్‌లో ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ఒకవేళ అది అవాస్తవమని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? అని ఈటలను ప్రశ్నించారు. ఇందుకు సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ బండ శ్రీనివాస్‌తో కలిసి కౌశిక్‌రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈటలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కదని అన్నారు. అందువల్లే ఆయన అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారనీ, సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ అనే ముసుగులో రాజకీయ కుట్రలు చేస్తున్న బీసీ దొర ఈటల అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.