పేద ప్రజల వైద్యుడు ‘నాదెండ్ల కిషోర్‌ కుమార్‌’ కన్నుమూత

– 23న సత్యనారాయణపురంలో అంత్యక్రియలు
– ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనేక వైద్య సేవలు
నవతెలంగాణ – బోనకల్‌
పేద ప్రజల వైద్యుడు నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ గురువారం హైదరాబాదులో అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ (62) వైద్యం రీత్యా సుమారు 40 సంవత్సరాల క్రితం బోనకల్లు మండల కేంద్రానికి వచ్చి ఆర్‌ఎంపీగా తన వృత్తిని ప్రారంభించాడు. ప్రారంభంలో చిన్న గది కిరాయికి తీసుకొని వైద్యం ప్రారంభించాడు. మండల కేంద్రంతోపాటు మండలంలోని 22 గ్రామాలకు పేద ప్రజల వైద్యుడిగా పేరు గడించారు. వైద్యం చేసినందుకు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆ తర్వాత కుటుంబ పరంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నలుగురు సంతానాన్ని పోషించుకుంటూ ఆర్థికంగా ఎన్నో ఒడిగడుగులకు గురయ్యారు. వైద్యరంగంలో రాణిస్తూనే మరోక వైపు రాజకీయ రంగంలోనూ రాణించారు. సీపీఐ(ఎం), తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. తన మిత్రుల సహకారంతో అతి కష్టం మీద రెండు గదులతో ఇల్లు నిర్మించుకున్నాడు. రాను రాను కుటుంబ పోషణ భారం కావడం, పిల్లలు పెద్దవారు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఊహించని నిర్ణయం తీసుకొని 20 ఏళ్ల క్రితం హైదరాబాదు తన మకామును మార్చారు. హైదరాబాదులో వైద్య వృత్తిని ప్రారంభించారు. తన ఇద్దరు కుమార్తెలను, ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఆర్థికంగా పూర్తిగా ఇబ్బందులు తొలగిపోయాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో అతని భార్య అరుణకు క్యాన్సర్‌ వచ్చింది. ఖరీదైన, నాణ్యమైన వైద్యం చేయించిన ఫలితం దక్కలేదు. 8 మే 2013న హైదరాబాదులోని అరుణ మృతి చెందారు. ఆ రోజు నుంచి కిషోర్‌ కుమార్‌ ఒకరకంగా తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అయినా ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారులకు వివాహం కావలసి ఉంది. పెద్ద కుమారుడు మనోజ్‌ కుమార్‌ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. చిన్న కుమారుడు మనేష్‌ కుమార్‌ తండ్రి దగ్గరే ఉంటూ సాఫ్ట్వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్‌ కుమార్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు.
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందించగా ఆ వైద్య బృందంలో నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ కూడా ఉన్నారు. బోనకల్‌ మండలం నుంచి బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ దగ్గర ఉండి వైద్యులతో మాట్లాడి సహకారం అందించారు. నారా చంద్రబాబు నాయుడును పేరు పెట్టి పిలిచే స్థాయికి కిషోర్‌ కుమార్‌ ఎదిగారు. హైదరాబాదులో నివాసం ఉంటూ కూడా బోనకల్‌ మండల ప్రజల మీద ప్రేమతో మండల కేంద్రంలో సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రతినెల ఉచిత వైద్య శిబిరం తన సొంత ఖర్చులతో నిర్వహించారు. సుమారు ప్రతినెల 75 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కుమారులు స్థిరపడటం, ఆర్థిక బాధలు తొలగిపోవడం, భార్య మృతి నుంచి కొద్దికొద్దిగా కోరుకుంటున్న సమయంలో నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ను మాయదారి మహమ్మారి క్యాన్సర్‌ సోకింది. దీంతో తన తండ్రిని క్యాన్సర్‌ భారం నుంచి కాపాడుకునేందుకు మెరుగైన వైద్యం కోసం ఇశ్రాయేల్‌ కూడా తీసుకెళ్లారు. అక్కడ వైద్య బృందం అనేక పరీక్షలు నిర్వహించింది. క్యాన్సర్‌ రోగం నుంచి మీరు పూర్తిగా కోలుకుంటారని అక్కడ వైద్య బృందం భరోసా కూడా ఇచ్చింది. నాలుగైదు నెలల క్రితం పరిస్థితి మరింత విషమించింది. దీంతో పరిస్థితి విషమించి హైదరాబాదులో కన్నుమూశారు. పెద్ద కుమారుడు మనోజ్‌ కుమార్‌ అమెరికాలో ఉండటంతో శుక్రవారం సాయంత్రం కల్లా హైదరాబాదు రానున్నారు. మృతదేహాన్ని గురువారం తమ స్వగ్రామమైన గార్ల మండలం సత్యనారాయణపురం తీసుకువచ్చారు. ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగాలకు మారుపేరుగా నిలిచిన నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ మృతి వార్త విన్న బోనకల్‌ మండల ప్రజలు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయారు.
23న అంత్యక్రియలు
గార్ల మండలం సత్యనారాయణపురంలో ఈనెల 23న నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారులు తెలిపారు.
పోతినేని సుదర్శన్‌ సంతాపం:
నాదెండ్ల కిషోర్‌ కుమార్‌ మృతి పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలిపారు. మండలంలోని ఆయన ఆప్త మిత్రులు ఎనమద్ది శ్రీనివాసరావు, తేనె వెంకటేశ్వర్లు, పారా శ్రీనివాసరావు, ఏనుగు వెంకటేశ్వరరావు, మచ్చ గురవయ్య, తెల్లాకుల శ్రీనివాసరావు మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, టిడిపి నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.