– నవంబర్ లో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాయిదాకు సంబంధించి టీఎస్ పీఎస్సీ చైర్మెన్, కార్యదర్శితో సమీక్షించామని సీఎస్ తెలిపారు. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసినట్టు సీఎస్ తెలిపారు. కాగా 18 శాఖల్లోని 783 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
లక్షలాది మందికి ఉపశమనం : కేటీఆర్
టీఎస్ పీఎస్సీ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉఫశమనం కలుగుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.