సుప్రీంకోర్టుకు ప్రబీర్‌, అమిత్‌

Prabir and Amit to the Supreme Court– ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా ) కేసులో తమ అరెస్టును, రిమాండ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషన్‌ కాపీలను సర్క్యులేట్‌ చేయవలసిందిగా పుర్కాయస్థ తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను కోరింది. అత్యవసర విచారణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.”ఇది న్యూస్‌క్లిక్‌ విషయం. జర్నలిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక్కడ నిందితుల్లో ఒకరు 75 ఏండ్ల వృద్ధుడు” అని సిబల్‌ పేర్కొన్నారు. కఠినమైన ఉపా ప్రకారం నిర్బంధ సమయంలో పోలీసులు రాతపూర్వక ఆధారాలను అందించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. అరెస్టు చేయడానికి గల కారణాలను రాతపూర్వకంగ ఇవ్వాలన్న పుర్కాయస్థ, చక్రవర్తి వాదనను తిరస్కరించింది. దీంతో పుర్కాయస్థ, చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.