– కొత్తగూడెంలో హస్తానిదే పై చెయ్యి
– ద్వితీయ స్థానంలో టీడీపీకి పట్టం
– 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టిడిపి, సీపీఐ, జనతా, పీడీఎఫ్, టీఆర్‌ఎస్ ఒక్కొక్కసారి గెలుపు
– తొలి కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూనంనేని
– వామపక్షాల ఓట్లే కీలకం
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం 11వ సారి ఎన్నికలకు సిద్ధమైంది. తొలుత 1957లో పాల్వంచ నియోజకవర్గంగా 1972 వరకు ఉన్నప్పుడు నాలుగు సార్లు ఎన్నికల జరగగా మూడుసార్లు కాంగ్రెస్, ఒకసారి సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. 1978లో కొత్తగూడెం నియోజకవర్గం రూపాంతరం తర్వాత పది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధిస్తే మూడుసార్లు టిడిపి ఒకసారి జనతా మరొకసారి సిపిఐ, టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తానికి 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు నియోజకవర్గంలో ఆదరించారు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో విజేతలు పరిణామాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకైక జనరల్ సీట్ కొత్తగూడెం నియోజకవర్గం 11వ సారి ఎన్నికలకు సిద్ధమైంది. మొత్తం ఓటర్లు 2,36,903 ఉండగా పురుషులు 1,14,995 మహిళలు 1,21,886 ట్రాన్స్ జెండర్స్ 22 ఉండగా సర్వీస్ ఓటర్లు 160 ఓట్లు ఉన్నాయి. మొత్తం 225 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గంలో పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలతో ఏజెన్సీ మైదాన ప్రాంతాల కలయిక ఉంది. పారిశ్రామిక ప్రాంతం చైతన్యవంతమైన నియోజకవర్గం కావడం ఉద్యోగ, ఉపాధ్యాయులు కార్మికుల ఓటు శాతం అధికంగా ఉండడం రెండు మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గం వ్యాపార విద్య వైద్య రంగాలు అధికంగా కలిగి ఉన్న ప్రాంతం కావడంతో పోటీ తీవ్రతరంగా ఉంటుంది.
పాల్వంచ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు చూస్తే 1957 ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కె.సుదర్శన్ రావు పిడిఎఫ్ పార్టీ అభ్యర్థి పర్స సత్యనారాయణపై గెలుపొందారు. 1962లో సీపీఐ అభ్యర్థిగా పరస సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేబి రావుపై గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోనుగంటి పిచ్చయ్య, పర్స సత్యనారాయణ పై గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేకూరి కాశయ్య పోటీ చేయగా సిపిఐ అభ్యర్థిగా ఎం.కొమురయ్య పై గెలుపొందారు. కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1978లో చేకూరి కాశయ్య జనతా పార్టీ పోటీ చేసి వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్)పై విజయం సాధించారు. 1983లో కోనేరు నాగేశ్వరరావు టిడిపి తరఫున పోటీచేసి చేకూరి కాశయ్య (కాంగ్రెస్)పై విజయం సాధించారు. 1985లో కోనేరు నాగేశ్వరరావు టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి పి సుధాకర్ రెడ్డి (కాంగ్రెస్)పై గెలుపొందారు. 1989లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో టీడీపీ నుంచి కోలే నాగేశ్వరరావు పై కాంగ్రెస్ నుంచి వెంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. స్వయంగా ఎన్టీ రామారావు నియోజకవర్గంలో ప్రచారం చేసిన ప్రజలు మాత్రం కాంగ్రెస్‌పై వైపే మొగ్గు చూపారు. 1994లో కోనేరు నాగేశ్వరావు టిడిపి నుంచి పోటీ చేసి వనమా వెంకటేశ్వర్ రావు (కాంగ్రెస్)పై గెలుపొందారు. 1999 వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నాగవాణి (టిడిపి) పై విజయం సాధించారు. 2004లో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కోనేరు నాగేశ్వరావు( టిడిపి)పై విజయం సాధించారు. 2009లో టిడిపి మద్దతుతో సిపిఐ పార్టీ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు పై విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఇప్పటి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేయగా వనమా వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలు టిఆర్ ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుకు పట్టం కట్టారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్ నుంచి జలగం వెంకట్రావు లో పోటీ పడగా కేవలం రెండు శాతం ఓట్లు మెజార్టీతో వెంకటేశ్వరరావు విజ యం సాధించారు. ఆ తర్వాత వనమా టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారా దానిపై వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాగా నియోజ కవర్గంలో వామపక్ష ఓట్లు కీలకంగా మారాయి.