ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి

Primary health centers should be strengthened– 24 గంటలూ సేవలందేలా చర్యలు తీసుకోవాలి
– ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు డాక్టర్లు ఉండాలి : మండలిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యకళాశాలల మంజూరు తదితర విషయాలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ సంకల్పానికి అభినందనలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం సగం కేంద్రాలే 24 గంటలు పని చేస్తుండగా, మరో సగం ఉదయం నుంచి సాయంత్రం వరకే అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. అందువల్ల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతరాయంగా సేవలందించేలా మార్చాలనీ, అదే విధంగా ప్రతి కేంద్రంలో ముగ్గురు చొప్పున డాక్టర్లు సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభించిన సమయంలో అవి బాగా పని చేశాయనీ, ప్రస్తుతం వాటిలో డాక్టర్ల కొరత, ఇతర ఇబ్బందులుంటున్నాయని తెలిపారు. అదే విధంగా పల్లె, బస్తీ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. మంత్రి హరీశ్‌ రావు సమాధానమిస్తూ….. ప్రజలకు వైద్యసేవలను మరింత ఎక్కువగా అందుబాటులో తెచ్చే ఉద్దేశంతోనే పల్లె, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కన్నా ఎక్కువగా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయనీ, వీటిలో మొదటి ప్రాధాన్యతగా ఎంబీబీఎస్‌, వారు అందుబాటులో లేకుంటే ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. ఆ ఇద్దరు కూడా లేని సెంటర్లలో బీ.యస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులతో సేవలందిస్తున్నామని చెప్పారు. వెల్‌నెస్‌ సెంటర్ల పని తీరు బాగుందనీ, ఒక వేళ ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు.