ఎమర్జెన్సీ.. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకం ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : భారతదేశ చరిత్రలో 21 నెలల కాలంలో మరిచిపోలేని కాలమని, ఇది రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 1975, జూన్‌ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రధాని మోడీ పై విధంగా ట్వీట్‌ చేశారు.
”ఎమర్జెన్సీని ఎదిరించి, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు కషి చేసిన ధైర్యవంతులందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. మన చరిత్రలో ఒక మరపురాని కాలంగా మిగిలిపోయింది, మన రాజ్యాంగం జరుపుతున్న విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది” అని ప్రధాని ఆరోపించారు. బీజేపీ కూడా ఇందిరాగాంధీ ఫోటోతో ”భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం” అని పోస్టర్‌ని ట్వీట్‌ చేసింది. నిరంకుశ పాలకులు ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులను దెబ్బతీశాయని, ఇది ఒక నిర్దిష్ట కుటుంబం, రాజకీయ పార్టీ అహంకారం, అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే కోరిక అంటూ మరో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ చేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు, ప్రహ్లాద్‌ జోషి, నితిన్‌ గడ్కరీలు కూడా ట్వీట్లు చేశారు.