– కేంద్ర ఆర్థిక మంత్రి భగవత్ కిషన్‌రావు కరద్
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
2023-24లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావు కరద్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా లావాదేవీకి సలహాదారుల నియామక ప్రక్రియ పూర్తయిందని, అయితే ఆసక్తిగల అర్హతగల పార్టీల నుండి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ఇంకా జారీ కాలేదని అన్నారు. ఈఓఐ దశ పూర్తయిన తరువాత లావాదేవీల రెండో దశలో మాత్రమే లావాదేవీల నిబంధనలు, షరతులు ఖరారు చేయబడతాయని అన్నారు. ప్రస్తుతం, ఈఓఐ దశ ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. అయితే, లావాదేవీల నిబంధనలు, షరతులను ఖరారు చేస్తున్నప్పుడు, ఉద్యోగుల చట్టబద్ధమైన ఆందోళనలు తగిన విధంగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఏపీలో రూ.950 కోట్లు ఉపాధి హామీలో వేతన బకాయిలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీలో రూ.950 కోట్లు వేతనాల బకాయిలు ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్వోతి తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జులై 26 నాటికి ఏపీలో ఉపాధి హామీలో వేతనాల బకాయిలు రూ.950 కోట్లు, యంత్రాల బకాయిలు రూ.40 కోట్లు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.6,366 కోట్లు వేతన బకాయిలు, రూ.6266 కోట్లు యంత్రాల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు వేతన బకాయిలు ఏమీ లేవని, యంత్రాల బకాయిలు మాత్రం రూ. 296 కోట్లు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ విద్యుత్ బకాయిల వసూలుకు చర్యలు.. కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కెసింగ్ ప్రకటించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయని, ఫలితంగా తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయాలని ఏపీని ఆదేశించిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్ నిమిత్తం కొంతకాలం సక్రమంగానే చార్జీలను చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం తదనంతరం చెల్లింపులను నిలిపివేసిందని తెలిపారు. ఫలితంగా తెలంగాణ చెల్లించవలసిన విద్యుత్ చార్జీల బకాయిలు రూ.6 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని, బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల అధికారులతో పలుమార్లు చర్చలు జరిపిందని అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా చేసినందున తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని మంత్రి చెప్పారు. ఒక రాష్ట్రం బకాయిలు చెల్లించకుండా మొండికేసిన సందర్భంలో బకాయిల చెల్లింపు కోసం కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రిత్వ శాఖతోను, ఆర్థిక మంత్రిత్వ శాఖతోను చర్చలు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించ వలసిందిగా రిజర్వు బ్యాంక్‌ను కోరే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఆర్‌కె సింగ్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.79,815 కోట్ల రుణాలు తీసుకునేందుకు గ్యారెంటీ ఇచ్చిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ద్వారా 2021-22 ఏడాదిలో రూ. 22,366.08 కోట్లు, 2022-23 ఏడాదిలో రు. 57,449.55 కోట్లు తీసుకున్నరుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉందని తెలిపారు.
ఆదాయపు పన్ను శాఖలో 27,564 పోస్టులు ఖాళీ
ఆదాయపు పన్ను శాఖలో 27,564 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జూన్ 1 నాటికి 1,164 గ్రూప్ ఎ, 464 గ్రూప్ బి (గెజిటెడ్), 25,936 గ్రూప్ బి (నాన్ గెజిటెడ్), గ్రూప్ సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.