ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిరసన

– రెగ్యులర్‌ చేయాలని దీక్ష
నవతెలంగాణ-బాసర
నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు బుధవారం అభ్యర్థన దీక్ష చేపట్టారు. యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ఆర్జీయూకేటి ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులర్‌ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. డిగ్రీ లెక్చరర్ల వలే యూనివర్సిటీ గ్రాంట్స్‌ నిబంధనలు తమకు వర్తిస్తాయని, తమను కూడా రెగ్యులర్‌ చేయాలని కోరారు. లేనియెడల పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు గోపాల్‌కృష్ణ, వినోద్‌ పాల్గొన్నారు.