నిరసన చేసిన

– ముస్లింలపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం
-మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ : ఇస్లాం మతం విషయంలో సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిపై వివాదాస్ప నినాదాలు చేసిన కొందరు ముస్లింలపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)ను ప్రయోగించనున్నది. రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో కొంతమందిపై ఎన్‌ఎస్‌ఏ కింద శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు.
ఈనెల 9న రత్లామ్‌లోని దీన్‌ దయాళ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలీసు అవుట్‌పోస్ట్‌ వెలుపల ముస్లిం సమాజానికి చెందిన పెద్ద సమూహం గుమిగూడి ఇన్‌స్టాగ్రామ్‌లో తమ విశ్వాసానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సదరు వ్యక్తిపై కొన్ని వివాదాస్పద నినాదాలను వారు వినిపించారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ నినాదాలు చేసిన నిరసనకారులను అరెస్టు చేస్తామనీ, ఎన్‌ఎస్‌ఏ కింద వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించటం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదనీ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సామాజికవేత్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంపుతామంటూ బహిరంగ బెదిరింపులకు దిగుతున్న హిందూత్వ శక్తులపై చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సంఫ్‌ు సిద్ధాంతంతో ఒక వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నదని వారు ఆరోపించారు.